ఫిన్‌లాండ్, జర్మనీలో పర్యటించిన టీచర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ వైదొలగాలని కొందరు అంటున్నారు
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నందుకా?
టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా?
ఫిన్‌లాండ్, జర్మనీలో పర్యటించిన టీచర్లతో ముఖాముఖిలో సీఎం రేవంత్‌రెడ్డి
2034 వరకు ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి వైదొలగాలని కొందరు మాట్లాడుతున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా? ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చినందుకా? విద్యార్థులకు నైపుణ్యం అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ వర్సిటీ బోర్డు సభ్యులుగా నియమించినందుకా’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ఫిన్‌లాండ్, జర్మనీలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులతో ముఖాముఖి సందర్భంగా గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పునరుద్ఘాటించారు. 80 వేల పుస్తకాలు చదివి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూళేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు.
మొదటి తారీఖునే జీతాలు
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు అందుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తెచ్చాం . విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తున్నాం . పిల్లలు తల్లిదండ్రులకు స్ట్రెస్ బస్టర్స్‌ం. అందుకే డే స్కాలర్ విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తున్నాం . సమాజంలో మానవ సంబంధాలు విచి్ఛన్నమైతే ఏ కుటుంబం, ఏ దేశం నిలబడదు. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల దగ్గరే పిల్లలు ఎక్కువ సమయం ఉంటారు.
తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో ఉపాధ్యాయులకూ అంతే బాధ్యత ఉంది . విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌లతో సమానంగా ఏటా 10–15 మంది టీచర్లను విదేశాలకు పంపి చదువుకునేందుకు అవకాశం కల్పిద్దాం. ఓట్లు, రాజకీయం కోసం నేను పనులు చేయడం లేదు. నాణ్యమైన విద్యను అందించాలనే బాధ్యతతో పనిచేసుకుంటూ వెళ్తున్నా. నా సంకల్పాన్ని మీరు ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడి నుంచే దీక్ష తీసుకుని బయలుదేరండి’ అని ఉపాధ్యాయులకు చెప్పారు.
విద్యార్థుల సమస్యలపై కొట్లాడండి
‘ఇంగ్లిష్ ఒక్కటే ముఖ్యమనుకుంటే చైనా ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది? 25 ఏళ్లు అమెరికా వైపు చూశాం.ం ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సింది జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాలపై . ఆ దేశాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుదాం . ఉపాధ్యాయ సంఘాలు మీ సమస్యలపై కాదు.. విద్యార్థుల సమస్యలపై కొట్లాడాలి. ఐదేళ్లు సమాజం కోసం, తరతరాల భవిష్యత్‌ను మార్చేందుకు ప్రతిజ్ఞ పూనండి . నాణ్యమైన విద్య అందించేందుకు ఇంకా ఏం చేయాలో మీరే సూచించండి . వచ్చే విద్యా సంవత్సరానికి ఏం చేస్తే బాగుంటుందో డిసెంబరులోగా నివేదిక ఇవ్వండి . ప్రతీ మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రణాళిక సిద్ధం చేయండి ’ అని సీఎం చెప్పారు.
ఒక్కో విద్యారి్థపై రూ.1.08 లక్షలు
‘ప్రతీ పేదవాడికి విద్యతోపాటు వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలి. నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందిచడమే లక్ష్యంగా పనిచేయాలి . ఏ ఆస్తులు లేకపోయినా చదువుకొని ఉద్యోగాలు సాధించిన వారు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడమే మా ప్రభుత్వ లక్ష్యం . ఒక్కో విద్యారి్థపై ప్రభుత్వం రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోంది . ప్రైవేటు స్కూల్ పిల్లలకు వారి తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు దాదాపు రూ.50 వేలు. ప్రభుత్వం ఎంతో వెచ్చిస్తున్నా తల్లిదండ్రులు ప్రైవేటు బడులకు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి ’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మోదీ చేసిన అప్పు రూ.151 లక్షల కోట్లు
స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి 2014 వరకు ప్రధానులుగా ఉన్నవాళ్లు చేసిన మొత్తం అప్పు రూ.50 లక్షల కోట్లు అని సీఎం రేవంత్ అన్నారు. 2014 నుంచి 2026 వరకు ప్రధాని మోదీ చేసిన అప్పు రూ.151 లక్షల కోట్లు అని చెప్పారు. ఇప్పటి వరకు దేశంపై ఉన్న అప్పు రూ.201 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. కొందరు చిన్న చిన్న సంఘటనలు చూపి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని భారత్‌ను సార్వ¿ౌమ దేశంగా మార్చిన వారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డైరెక్టర్ శాంతికుమారి పాల్గొన్నారు.


