24 గంటల్లో రెండు ఎన్‌కౌంటర్లు.. నిందితులకు గాయాలు | Encounter of Accused UP Police action from Meerut to Lalitpur | Sakshi
Sakshi News home page

24 గంటల్లో రెండు ఎన్‌కౌంటర్లు.. నిందితులకు గాయాలు

Oct 3 2026 9:54 AM | Updated on Oct 3 2026 10:34 AM

Encounter of Accused UP Police action from Meerut to Lalitpur

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వేర్వేరు నేరపూరిత కేసుల్లో ప్రమేయం ఉన్న ఇద్దరు దుండగులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 24 గంటల వ్యవధిలో రెండు ఎన్‌కౌంటర్లు చేసి, నేరస్థులకు గట్టి హెచ్చరిక చేశారు. మొదటి ఎదురుకాల్పుల ఘటన మీరట్‌లో చోటుచేసుకోగా, మహిళ హత్య కేసులో వాంటెడ్‌గా ఉన్న నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ అనంతరం అరెస్ట్ చేశారు. మరోవైపు లలిత్‌పూర్‌లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు పోలీసుల దాడిలో గాయపడ్డాడు. రెండు ఘటనల్లోనూ నిందితుల కాళ్లకు బుల్లెట్లు తగిలాయి.

మీరట్‌‌లోని హస్తినాపూర్ ప్రాంతంలో అక్టోబర్ 2 రాత్రి మవానా సరిహద్దు వద్ద పోలీస్ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. ఆ సమయంలో కరీంపూర్ వైపు నుంచి ఇద్దరు అనుమానిత దుండగులు రావడం కనిపించింది. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించగా, నిందితులు ఒకచోట దాక్కుని పోలీస్ బృందంపై కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపగా, శుభమ్ అలియాస్ బార్వి అనే నిందితుడి రెండు కాళ్లకు బుల్లెట్లు తగిలాయి.

మవానా సీఓ పంకజ్ లవానియా తెలిపిన వివరాల ప్రకారం, విచారణలో నిందితుడు సెప్టెంబర్ 13న ఒక మహిళను హత్య చేసి, ఆమె పట్టీలు, చెవిదుద్దులు, మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్లు అంగీకరించాడు. పోలీసులు నిందితుడి నుంచి ఆ మహిళకు చెందిన పట్టీలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రెండో నిందితుడి పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.

రెండో ఘటన లలిత్‌పూర్‌లో జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు సుఖ్‌లాల్ సహరియాను పోలీసులు ఎదురుకాల్పుల అనంతరం అరెస్ట్ చేశారు. తాల్‌బెహట్ కొత్వాలి పరిధిలోని పవా గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో పోలీస్ బృందం నిందితుడిని చుట్టుముట్టింది. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ తగిలింది. గాయపడిన నిందితుడిని జిల్లా మెడికల్ కాలేజీకి తరలించారు. అతని వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, సజీవ తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: హెలికాప్టర్ నుంచి రేషన్ ప్యాకెట్లు పడి వృద్ధుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement