9వ తరగతిలోనే పన్నుల పాఠాలు సరికొత్తగా!
చిన్న వయసులోనే ఆర్థిక అక్షరాస్యత
ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, పన్నుల విధానంపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించే దిశగా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కీలక అడుగు వేసింది. 9వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకం ‘అండర్‌స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ - పార్ట్ 2’లో వ్యక్తిగత ఆదాయ పన్ను లెక్కింపు అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. పన్నులు చెల్లించడం అనేది కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాక, దేశ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు దోహదపడే బాధ్యత అని ఈ కొత్త అధ్యాయం స్పష్టం చేస్తోంది.
ఈ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులు సరికొత్త ‘న్యూ టాక్స్ రెజీమ్’ కింద పన్ను స్లాబ్‌లను అర్థం చేసుకుంటూ స్వయంగా టాక్స్ లెక్కింపులను నేర్చుకుంటారు. క్లిష్టతను నివారించేందుకు ఓల్డ్ టాక్స్ రెజీమ్ మినహాయింపులను ఇందులో పక్కన ఉంచారు. దీనివల్ల విద్యార్థులకు ప్రయోగాత్మక, ఆచరణాత్మక పరిజ్ఞానం అందుతుందని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ వివరించారు.
పన్నులకే పరిమితం కాదు..
కేవలం పన్నులకే పరిమితం కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వివిధ పెట్టుబడి మార్గాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. చిన్న వయస్సులోనే పెట్టుబడులు ప్రారంభించడం ద్వారా పొదుపు, సంపద సృష్టి ఏ విధంగా సాధ్యమవుతుందో ఉదాహరణలతో వివరించారు.
దేశాభివృద్ధికి ముఖ్యం
ఆదాయం ఆర్జించడం ఎంత ముఖ్యమో... ఖర్చులు, పొదుపు, భవిష్యత్ అవసరాల కోసం బాధ్యతాయుతంగా రుణాలు తీసుకోవడం, ఆర్థిక నష్టాల నుంచి రక్షణ పొందడం వంటి సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ప్రధానమని దీని ఉద్దేశం. విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక క్రమశిక్షణను, దేశాభివృద్ధిలో భాగస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని విద్యావేత్తలు నమ్ముతున్నారు.
ఇదీ చదవండి: ‘ఎన్‌పీఎస్ తత్కాల్’.. క్షణాల్లో రిటైర్మెంట్ ప్లానింగ్!


