పంజాబ్ కాంగ్రెస్‌లో చాలాకాలంగా సాగుతున్న అంతర్గత పోరు మరో కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో మాజీ భారత హాకీ కెప్టెన్, జలంధర్ కాంట్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. అయితే ఈ మార్పు కంటే.. పదవి నుంచి తప్పుకున్న తర్వాత వారింగ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
పంజాబ్ కాంగ్రెస్‌లో కొంతకాలంగా రాజా వారింగ్ వర్గానికి, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ వర్గానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. 2022 ఏప్రిల్‌లో పీసీసీ అధ్యక్షుడైన వారింగ్.. రాష్ట్రంలో పార్టీని నడిపిస్తూ వచ్చారు. అయితే చన్నీ వర్గం మాత్రం నాయకత్వ మార్పు కోరుతూ వచ్చింది. ఈ అంతర్గత పోరు క్రమంగా బహిరంగ చర్చగా మారింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సెప్టెంబర్‌లో పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా భూపేశ్ బఘేల్ స్థానంలో సచిన్ పైలట్‌ను నియమించింది. పైలట్ సమక్షంలో సెప్టెంబర్ 15న జరిగిన పార్టీ కార్యక్రమంలో వారింగ్, చన్నీ ఒకే వేదికపై కనిపించి చేతులు కలపడంతో విభేదాలు తగ్గినట్టుగా కనిపించినా.. అధ్యక్ష పదవిపై అసలు పంచాయితీ మాత్రం కొనసాగింది.
‘నన్నెవరూ రాజీనామా అడగలేదు’
“చన్నీ సాహెబ్ గెలిచారు”.. వారింగ్ వ్యాఖ్యల్లో ఇదే అసలు సంచలనం ఇదే. తన రాజీనామా, తదుపరి జరిగిన అధ్యక్షుడి ఎన్నికపై వారింగ్ స్పందిస్తూ ఆయన ఈ కామెంట్ చేశారు. అంటే.. తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చాలాకాలంగా కోరుతున్న చన్నీ వర్గం కోరుకున్న మార్పు చివరకు జరిగిందన్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 30న వారింగ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. తనను ఎవరూ నేరుగా రాజీనామా చేయాలని అడగలేదని వారింగ్ చెప్పారు. పరిస్థితి ఒక దశకు చేరుకుందని భావించి తానే పదవి నుంచి తప్పుకున్నానని వివరించారు. అయితే అదే సమయంలో పార్టీ ఇన్‌చార్జ్ సచిన్ పైలట్ తనను తప్పించాలని కోరుకున్నారని తనకు తెలిసిందని చెప్పారు.
వారింగ్ స్థానంలో పర్గత్ సింగ్ ఎందుకు?
వారింగ్ స్థానంలో పర్గత్ సింగ్‌ను ఎంపిక చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పర్గత్ సింగ్ మాజీ భారత హాకీ కెప్టెన్, ఒలింపియన్. 2012 నుంచి జలంధర్ కాంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అందుకే పర్గత్ నియామకాన్ని వారింగ్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గానికి అనుకూల పరిణామంగా కొందరు చూస్తున్నారు. అయితే ఆయనకు సొంత రాజకీయ అనుభవం కూడా ఉంది. ఇప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ముందున్న ప్రధాన సవాలు.. పార్టీలోని వివిధ వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావడం.
చన్నీ పరిస్థితి ఏంటి?
చన్నీ పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు. జూలైలో ఆయనకు పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు వారింగ్ అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం చన్నీ వర్గంలో అసంతృప్తి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు వారింగ్ వెళ్లిపోవడం, ఆయన స్థానంలో పర్గత్ సింగ్ రావడంతో చన్నీ ప్రభావంపై చర్చ మళ్లీ మొదలైంది. కొత్త అధ్యక్షుడి నియామకాన్ని చన్నీ స్వాగతించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సచిన్ పైలట్ సహా అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పైలట్ పాత్రపై ఎందుకింత చర్చ?
పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా సచిన్ పైలట్ నియమితులై కొన్ని వారాలే అవుతోంది. ఆయన రాక తర్వాతే అధ్యక్షుడి మార్పు జరగడంతో వారింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక పార్టీ సీనియర్ నేత సుఖ్‌జిందర్ సింగ్ రంధావా.. వారింగ్, తాను సహా పలువురు నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి కారణమయ్యామని వ్యాఖ్యానించారు.
ముందుంది మహా సంగ్రామం
పంజాబ్‌లో 2027 ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన సంస్థాగత వ్యవస్థను ఎన్నికలకు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికలను సామూహిక నాయకత్వంతో ఎదుర్కొంటామని, ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించబోమని సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు పర్గత్ సింగ్ బాధ్యతలు చేపట్టడంతో వారింగ్, చన్నీ వర్గాలతో పాటు ఇతర నేతలను కూడా సమన్వయం చేసుకుని పార్టీని ఎన్నికల దిశగా నడిపించడం ఆయన ముందున్న పని.
మొత్తానికి.. వారింగ్ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో ఒక అధ్యాయం ముగిసింది. పర్గత్ సింగ్ నియామకంతో మరో అధ్యాయం మొదలైంది. “చన్నీ సాహెబ్ గెలిచారు” అన్న వారింగ్ వ్యాఖ్య ఇప్పుడు చర్చగా మారినా.. అసలు ఫలితం తేలేది మాత్రం ముందున్న రాజకీయ పరీక్షలోనే. వర్గ విభేదాలను పక్కనపెట్టి నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం పర్గత్ సింగ్‌కు ఇప్పుడు కీలక సవాలు.
ఇదీ చదవండి: మోదీకి వచ్చిన కానుకలు మీ సొంతం చేసుకునే చాన్స్!


