సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రికి దేశవిదేశాల సందర్శనలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా లభించిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి సంబంధించిన ‘పీఎం మెమెంటోస్’8వ విడత వేలం గడువును ఈనెల 31వ తేదీ వరకూ కేంద్రం పొడిగించింది. ఆన్‌లైన్ ద్వారా 30 రకాల జ్ఞాపికలు, కానుకల విక్రయానికి జరిగే ఈ–వేలం ప్రక్రియలో ఈసారి కాకతీయ కళాతోరణం వెండి నమూనా కూడా ఉంది. దీనికి ప్రాథమిక ధర రూ.10 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
అత్యధికంగా జగన్నాథ పరివార రథం ప్రతిమకు రూ.21 లక్షల బేస్ ప్రైస్ ఉంది. తర్వాత కర్ణాటక శ్రీరాముడి వెండి విగ్రహానికి రూ.13.50 లక్షలుగా ఉంది. వివిధ దేవాలయాలు, చరిత్రాత్మక ప్రదేశాల నమూనాలు, సంప్రదాయ చేతివృత్తుల కళారూపాలు, చిత్రాలు, పెయింటింగులు, విగ్రహాలు, శాలువాలు వంటివి 30 రకాల వరకూ ఈ వేలంలో ఉంచారు. వేలం ఆదాయాన్ని గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నవామి గంగే’ప్రాజెక్టుకు విరాళంగా అందించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది.


