ఉక్రెయిన్ రాజధానిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
భారత్ నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదన అందిందన్న ఉక్రెయిన్
తాత్కాలిక విరమణకు అంగీకరించబోమంటున్న రష్యా
కీవ్: ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లోని జనావాసాలు, గ్యాస్ స్టేషన్లు, సూపర్‌మార్కెట్ గోదాములు, డేటా సెంటర్లపై డ్రోన్‌లు, క్షిపణులను ప్రయోగించి ధ్వంసం చేసిన రష్యా తన తంత్రాన్ని మార్చుకుంది. ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించేందుకు రవాణాకు కీలకమైన వంతెనలపై దృష్టి సారించింది. గురువారం రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని నీప్రో నదిపై ఉన్న ఆరు ముఖ్యమైన వంతెనలకు గాను మూడింటిపై డ్రోన్లతో దాడులకు పాల్పడింది.
ఈ దాడుల్లో వంతెనలు తీవ్రంగా దెబ్బతినడంతో అధికారులు వాటిని మూసివేశారు. దీంతో, వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. కీవ్ సహా 9 ప్రాంతాలపై గురువారం రాత్రి రష్యా 100కుపైగా డ్రోన్లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఇందులో సగానికి సగం అత్యంత వేగంతో, గగనతల రక్షణ వ్యవస్థలకు అందనంత ఎత్తులో ఎగిరేవని చెప్పారు. ఈ దాడుల్లో ఒకరు చనిపోగా, నలుగురు గాయపడ్డారన్నారు.
అంతర్జాతీయ ఆంక్షల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని రష్యా ఆయుధాల తయారీకి అవసరమైన సామగ్రిని తేలిగ్గా కొనుగోలు చేస్తోందన్నారు. అందుకే, వాణిజ్య ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని పిలుపునిచ్చారు. ఇలా ఉండగా, గురువారం రాత్రి క్రిమియా, నల్ల సముద్రం, అజోవ్ సముద్రం సహా పలు ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ప్రయోగించిన 646 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.
భారత్ నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదన
తాత్కాలిక కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, తుర్కియే, ఈజిప్టులతోపాటు మొదటిసారిగా భారత్ నుంచి కూడా వేర్వేరు ప్రతిపాదనలు అందాయని ఉక్రెయిన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇంధన కొరతకు కారణమవుతున్న రష్యాలోని చమురు వనరులపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్ దాడులు, ఉక్రెయిన్‌లో తీవ్ర కరెంటు కోతలకు కారణమవుతున్న ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా దాడులను నిలిపివేయడం, నల్ల సముద్రం మీదుగా ప్రపంచ దేశాలకు కీలకమైన ఆహార ధాన్యాల రవాణాను యథా ప్రకారం కొనసాగనివ్వడం ఇందులో ఉన్నాయని ఆ అధికారి వివరించారు.
ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ ముందుకు వచి్చందని చెప్పారు. రష్యా దాడులను నిలిపివేసిన పక్షంలో తాము కూడా ఆ దేశంపై దాడులను ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. రష్యా మాత్రం పూర్తి స్థాయి కాల్పుల విరమణ మాత్రమే తాము కోరుకుంటున్నామని రష్యా స్పష్టం చేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఇటీవల అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. వీటి ప్రభావం చైనాతోపాటు రష్యా ప్రధాన చమురు దిగుమతి దారుల్లో ఒకటైన భారత్‌పైనా పడుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ మధ్యవర్తిత్వానికి ముందుకు రావడం గమనార్హం.


