నీట్ పీజీ ఆన్సర్ కీ విధానంపై సుప్రీంకోర్టులో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పీజీ –2026 వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) విడుదల చేసిన ’ఆన్సర్ కీ’ విధానం ఏమాత్రం పారదర్శకంగా లేదంటూ డెమోక్రాటిక్ మెడికల్ అసోసియేషన్ రిట్ దాఖలు చేసింది. అభ్యర్థులకు అసలు ప్రశ్నలు, ఆప్షన్లతో పాటు కచ్చితమైన సమాధానాలను వెల్లడించేలా బోర్డును ఆదేశించాలని కోరింది. కేవలం కోడ్‌లకు పరిమితం చేస్తూ అక్టోబర్ 1న ఎన్‌బీఈఎంఎస్ జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కోరింది.
కోడ్‌లతో గందరగోళం
ఈ ఏడాది ఆగస్ట్ 30న నీట్–పీజీ పరీక్ష జరగ్గా సెప్టెంబర్ 24న ఫలితాలు వెలువడ్డాయి. అ భ్యర్థుల లాగిన్ ద్వారా కేవలం ప్రశ్నల ఐడీ లు, సమాధానాల న్యూమరికల్ (సంఖ్యా) ఐడీలు, అభ్యర్థులు నమోదు చేసిన జవాబుల ఐడీలు, ప్రతి ప్రశ్నకు వచ్చిన మార్కులను మాత్రమే ఎన్‌బీఈఎంఎస్ అందుబాటులో ఉంచింది. ఈ విధానంపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్‌బీఈఎంఎస్ విధానం ప్రకారం పరీక్షలో ఒక్కో అభ్యరి్థకి ప్రశ్నల వరుసక్రమంతో పాటు ఆప్షన్లను సైతం తారుమారు చేస్తారు. ఇలాంటప్పుడు కేవలం సంఖ్యలను మాత్రమే ఇస్తే ఏ ప్రశ్నకు ఏ ఆప్షన్ ఎంచుకున్నామనేది తెలుసు కోవడం అసాధ్యమని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల కేవలం మార్కుల లెక్కింపు మాత్రమే సాధ్యమవుతుందని, అసలు ప్రశ్నలు లేకుండా జవాబులను నిర్ధారించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.


