సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో ఆర్మూర్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబం, రేవంత్ రెడ్డి ఆస్తులపై సుప్రీంకోర్టు,హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించే దమ్ముందా అని ప్రశ్నించారు.
నా ఆస్తులు, మీ ఆస్తులు పుట్టిన కాడి నుంచి తీద్దాం. కేసీఆర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు, అలాగే మీరు (రేవంత్ రెడ్డి) పుట్టినప్పటి నుంచి నేటి వరకు కూడబెట్టిన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు లేఖ రాయడానికి మీకు దమ్ముందా? అని నిలదీశారు. విచారణలో తమ తప్పుందని తేలితే జడ్జి ఏ శిక్ష వేసినా సిద్ధమని స్పష్టం చేశారు.
కమల్ హాసన్,రజనీకాంత్ కంటే సీఎం రేవంత్ గొప్పగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తాను 2006లోనే హోటల్ వ్యాపారం ప్రారంభించానని, అది ఇప్పుడు మూడు హోటల్స్ అయ్యాయని, ఆ వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లోనే స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. వ్యాపారం చేయడం తప్పా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో 33 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు.
ఇదీ చదవండి : అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లా : సీఎం రేవంత్
నాకు హోటల్ ఉందని 2009లోనే అఫిడవిట్లో పెట్టాను రేవంత్ రెడ్డి నాకు హోటల్ ఉంది అంటున్నాడు.. నేనే చెప్పినదాన్ని నువ్వు చెప్పేదేంది? కొలంబస్లాగా! వాస్కోడిగామా కనుక్కున్నట్లు నువ్వు కొత్తగా కనుక్కున్నదేంది? - కేటీఆర్ https://t.co/UEyF6nZaeY
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026


