న్యూఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ ఎటువంటి పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చినా తాము సిద్ధంగా లేమని చెప్పారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
''తెలంగాణలో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు ఉండదు. బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని ఎవరు అంటున్నారు? బీఆర్ఎస్‌తో పొత్తు ఎవరు కోరుకోవడం లేదు. మొదట కేటీఆర్ ఆయన చెల్లెలు కవితతో కలిసి ఉండాలి. కేసీఆర్ కుటుంబమంతా ఐక్యంగా ఉంటే చాలు. మేము వాళ్లతో కలవాల్సిన అవసరం లేదు. ఖైరతాబాద్‌లో లాస్ట్ టైం పొరపాటున ఓడిపోయాం. ఈసారి వందకు వంద శాతం సీటు నిలబెట్టుకుంటాం. బీజేపీని గెలిపించాలని ఖైరతాబాద్ ప్రజలు ఇప్పటికే మెంటల్‌గా ప్రిపేరైపోయారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజల తీర్పును కాలరాసింద''ని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
రేవంత్.. సోనియా బానిస
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. సోనియా గాంధీ కుటుంబానికి బానిసగా ఉంటానని చెప్పడాన్ని ఆక్షేపించారు. 'రేవంత్.. ఢిల్లీలో సోనియా కుటుంబానికి బానిస. హైదరాబాద్‌లో మజ్లిస్ కుటుంబానికి బానిస' అని వ్యాఖ్యానించారు. మహిళల రిజర్వేషన్లు, పార్లమెంట్ సీట్ల పెంపు విషయంలో రేవంత్‌రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. సీట్ల పెంపు విషయంలో అబద్దాలతో విషం చిమ్ముతూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపాలని పీజేఆర్ కుమార్తె పిటిషన్
రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా
రేవంత్‌రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సనాతన ధర్మం, రాజ్యాంగబద్ధ సంస్థలపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. మతం, దేవుడి పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రోజుకే కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజలను అన్ని రకాలుగా విభజించే అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Live: Press Meet, 6, Ashoka Road, New Delhi.https://t.co/z7uuGYvRgC
— G Kishan Reddy (@kishanreddybjp) October 1, 2026


