మంచిర్యాల టౌన్: తన తల్లికి అనారోగ్యం ఉందని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకు వస్తే, వైద్యులు, వైద్య సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఆసుపత్రి వీల్‌చైర్‌లోనే తన తల్లిని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి తీసుకెళ్లాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన భూక్య బుజ్జి కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది.
ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కొడుకు రాజ్‌కుమార్ మంగళవారం రాత్రి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం తెచ్చారు. సిబ్బంది, వైద్యులు వీల్‌చైర్‌లోనే కూర్చోబెట్టి ఇంజక్షన్ ఇచ్చి వదిలేశారు. కనీసం బెడ్ ఇవ్వకపోగా, వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తన తల్లిని అదే వీల్‌చైర్‌లో తీసుకుని అర్థరాత్రి 12:30 గంటల సమయంలో ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నాడు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా ఎమ్మెల్యే ఇంటి ముందు తన తల్లికి వైద్యం అందించాలని ఆందోళన చేశాడు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీధర్ ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని ఆస్పత్రిలో వైద్యం అందిస్తామని నచ్చజెప్పి తీసుకెళ్లారు.
నెఫ్రాలజిస్టు లేకపోవడంవల్లే..: ఆస్పత్రి సూపరింటెండెంట్ అశోక్ ఈ ఘటనపై స్పందిస్తూ.. బుజ్జి ఆయాసం, ముఖం వాపు సమస్యలతో క్యాజువాలిటీకి మంగళవారం రాత్రి వచ్చిందని తెలిపారు. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, కుడివైపు పక్షవాతంతో బాధపడుతుంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో ఫిస్టులా ఆపరేషన్ చేయించుకోవాలని గతంలోనే సూచించామని తెలిపారు. కానీ ఆమె చేయించుకోలేదని పేర్కొన్నారు. నెఫ్రాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో వరంగల్ ఎంజీఎంకు పంపించామన్నారు. ఆస్పత్రికి మద్యం మత్తులో వచ్చి, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి రోగిని వీల్‌చైర్‌పై కావాలనే ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లారని తెలిపారు.


