ఎలక్ట్రానిక్స్ బ్రాంచీలో నైపుణ్యం సమస్య
ఐఐటీల్లోనూ సెమీ కండక్టర్స్ పరిశోధనకు ఆటంకం
దేశంలో సెమీ కండక్టర్ల తయారీ లేకపోవడమే సమస్య
బహుళజాతి సంస్థల ఉద్యోగావకాశాల్లో ఇబ్బందులు
ఐఐటీ, ఎన్‌ఐటీల తాజా నివేదిక
ప్రత్యేక పరిశోధన కేంద్రాలపై ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: ఎలక్టాన్రిక్స్ ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త సవాల్ ఎదురైంది. కీలకమైన సెమీ కండక్టర్ల తయారీలో విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోల్పోతున్నారు. దేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ విస్తరించకపోవడం, ఏఐ ఆధారిత మార్పులకు తగ్గట్టుగా అవసరమైన డిజైనింగ్‌పై దృష్టి పెట్టకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీనివల్ల ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థులు బహుళ జాతి సంస్థల్లో సులువుగా స్కిల్డ్ ఉద్యోగాలు పొందలేని పరిస్థితి.
ప్రపంచవ్యాప్తంగా చిప్ డిజైన్, తయారీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ వంటి విభాగాల్లో నిపుణుల అవసరం పెరుగుతున్నప్పటికీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు సరిపోయే ప్రాక్టికల్ శిక్షణ కొరవడుతోందని దేశంలోని ఎన్‌ఐటీలు, ఐఐటీలు కేంద్ర ప్రభు త్వం దృష్టికి తెచ్చాయి. తాజాగా జరిపిన అధ్యయనంలో వెల్లడైన అంశాలతో ఓ నివేదిక సమరి్పంచాయి. ఎల్రక్టానిక్స్ బ్రాంచీ విద్యార్థులు తగిన నైపుణ్యం సంపాదించేలా సెమీ కండక్టర్ స్మార్ట్ చిప్ డిజైనింగ్‌పై పరిశోధన కేంద్రాలు పెంచాలని సూచించాయి.
ఆ మార్పులు ఏ మూలకు?
దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 1.60 లక్షల మంది నేరుగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. మరో లక్ష మంది వరకూ ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఎల్రక్టానిక్స్‌లో కీలకమైన విభాగం చిప్‌డిజైనింగ్. ఇంకా చెప్పాలంటే సెమీ కండక్టర్ చిప్స్ తయారీ. వీటిని ఇప్పటికీ మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సామర్థ్యం ఉన్న విద్యార్థులు ఇతర దేశాలకు పరిశోధన కోసం వెళ్తున్నారు. దేశంలో ఉన్న విద్యార్థులకు పరిశోధన అవకాశాలు తక్కువగా ఉంటున్నాయనేది ఐఐటీల అధ్యయనం. వాస్తవానికి ఎలక్ట్రానిక్స్ కోర్సును రీడిజైన్ చేశారు.
సెమీకండక్టర్ రంగానికి అనుగుణంగా వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఐసీ మాన్యూఫ్యాక్చరింగ్‌పై ప్రత్యేక సబ్జెక్టులను జోడించారు. డిప్లొమా, మైనర్ డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులోకి తెచ్చారు. థియరీ పరంగా బోధన ప్రణాళికను బలోపేతం చేసినప్పటికీ, ఆత్యాధునిక టూల్స్ వినియోగం ప్రాక్టికల్‌గా పెరగలేదని అధ్యయనంలో వెల్లడైంది. చిప్ టు స్టార్టప్ (సీ2ఎస్) వంటి కార్యక్రమాల ద్వారా విద్యా సంస్థలకు ఎల్రక్టానిక్స్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ) టూల్స్‌ను అందిస్తున్నారు. 2026 నాటికి 315 విద్యాసంస్థల్లో ఈ టూల్స్ అందుబాటులో ఉండగా, 68 వేల మందికి పైగా శిక్షణ పొందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులు చిప్ డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, టెస్టింగ్ వరకు అనుభవం పొందేలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించింది. అయితే, వీటిని పరిశ్రమల్లో వాడే అనుభవం మాత్రం విద్యార్థులు పొందలేకపోతున్నారని ఐఐటీలు అంటున్నాయి.
కాలేజీల సమస్యేంటి..?
కేవలం వీఎల్‌ఎస్‌ఐ సబ్జెక్టులను సిలబస్‌లో చేర్చడం ద్వారా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు రావనేది ఐఐటీల వాదన. ఈడీఏ టూల్స్, సెమీకండక్టర్ ల్యాబ్‌లు, టేప్‌అవుట్, ఫ్యాబ్రికేషన్, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, టెస్టింగ్‌పై విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం అవసరం. నీతి అయోగ్ కూడా సాధారణ వీఎల్‌ఎస్‌ఐ నైపుణ్యాలను దాటి ప్రాసెస్ ఇంటిగ్రేషన్, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, రిలయబులిటీ, ప్యాకేజీ అవేర్ డిజైన్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు కావాలని సూచించింది. అయితే, ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం ఆ స్థాయిలో బోధించే అధ్యాపకుల కొరతను ఎదుర్కొంటున్నాయి.
ఎలక్ట్రానిక్స్ బోధన రంగంలో అనుభవం ఉన్నప్పటికీ మారిన స్మార్ట్ డిజైన్ చిప్‌లపై మరింత శిక్షణ అవసరమంటున్నారు. ఈ దిశగా అధ్యాపకులకు ప్రత్యేక ఓరియంటేషన్ కూడా కావాలని సూచిస్తున్నారు. కాలేజీలు దీన్ని భరించేందుకు ముందుకు రావడం లేదు. దేశంలో సెమీ కండక్టర్ల రంగం బలంగా లేకపోవడం వల్ల విదేశీ నిపుణులతో శిక్షణ తీసుకోవాలి. దీనికి అయ్యే ఖర్చు విద్యార్థుల నుంచి వసూలు చేసే అవకాశం ఇవ్వానేది కాలేజీల వాదన.
పరిశ్రమ–వర్సిటీ భాగస్వామ్యాలు, ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ చిప్ డిజైన్ ప్రాజెక్టులు, ఫ్యాబ్ సంస్థలతో శిక్షణ కార్యక్రమాలను పెంచడం కూడా ఖర్చుతో కూడుకున్నదేనని చెబుతున్నాయి. అయితే, సెమీ కండక్టర్ రంగం భవిష్యత్‌లో కేవలం ఈసీఈ విద్యార్థులకే పరిమితం కాదని నిపుణులు అంటున్నారు. మెకానికల్, కెమికల్, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకూ చిప్ తయారీ, ప్యాకేజింగ్, పరికరాల నిర్వహణ, ఆటోమేషన్, డేటా విశ్లేషణ వంటి విభాగాల్లో అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. పరిశోధనలు పెంచితేనే ఈ తరహా విద్యకు అర్థం ఉంటుందని ఐఐటీలు, ఎన్‌ఐటీలు కేంద్రానికి చేసిన ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి.


