నగరంలో అడుగడుగునా ట్రాఫిక్ సమస్యలే
పరిష్కారాలున్నా పట్టని యంత్రాంగాలు
ఏళ్లుగా పెండింగ్‌లోనే కీలక ప్రతిపాదనలు
సాక్షి, సిటీబ్యూరో : రహదారి భద్రతను మెరుగు పరిచి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా టీ–మార్స్ పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేసింది. కానీ.. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు యంత్రాంగాల నిర్లక్ష్యం కారణంగా నగర జీవికి నరకం చూపిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నగర విస్తీర్ణంలో కనిష్టంగా 12 శాతం రోడ్లు ఉండాలి. హైదరాబాద్ పురాతన నగరం కావడం, అన్‌ప్లాన్డ్‌గా విస్తరించడం తదితర కారణాలతో కేవలం 9 శాతం మాత్రమే రోడ్లు విస్తరించి ఉన్నాయి.
ప్రణాళికాబద్ధంగా ఫ్లై ఓవర్లను నిర్మిస్తే ఈ రోడ్ల పరిమాణాన్ని పెంచుకునే అవకాశం ఉంది. తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని అడ్డంకులు తొలగిస్తే ట్రాఫిక్ కష్టాలు చాలావరకు తగ్గుతాయి. నగర రోడ్ల సమస్యలను గుర్తించేది ట్రాఫిక్ పోలీసులే అయినప్పటికీ వాటికి పరిష్కారం చూపాల్సింది మాత్రం మున్సిపల్ అధికారులే. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి కొన్ని కీలకమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ అనేకసార్లు ట్రాఫిక్ పోలీసులు నివేదికలు పంపారు. ఇప్పటికీ ఇవి పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు.
పెండింగ్ ప్రతిపాదనలిలా..
ట్రక్ టెర్మినల్స్
నగరంలోకి మృత్యుశకటాలుగా దూసుకువస్తున్న లారీల కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా నగర శివార్లలో ట్రక్ టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదన ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది.
ప్రైవేట్ బస్టాండ్లు
నగరం నుంచి బయటకు వెళ్తున్న, నగరానికి వస్తున్న ప్రైవేటు బస్సులు ప్రాంతాల్లో రోడ్లపై పార్క్ అవుతున్నాయి. నిర్దేశిత సమయం కంటే ముందే నగరంలోకి ‘చొచ్చుకువసున్నాయి’. దీంతో ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్స్ పెరుగుతున్నాయి. నలువైపులా ప్రైవేట్ బస్టాండ్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల్ని గుర్తించాలి.
ప్రణాళికబద్ధంగా ఫ్లైఓవర్లు
నగరంలో ప్రస్తుత ఫ్లైఓవర్లకు తోడు అదనంగా మరి అవసరమని ట్రాఫిక్ అధికారుల అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న సీతాఫల్‌మండి, జామై ఉస్మానియా, బేగంపేట, తెలుగుతల్లి, డబిర్‌పుర, గ్రీన్‌లాండ్స్, లాలాపేట్ ఫ్లైఓవర్లకు ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఇబ్బందులు వస్తున్నాయి.
ఎఫ్‌ఓబీలతోనే పాదచారుల భద్రత
నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకుల తర్వాతి స్థానం పాదచారులదే. దీనికి పరిష్కారంగా ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు తోడు మరో 37 చోట్ల వీటిని నిర్మించి పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నది ఏళ్ల క్రితం నాటి ప్రతిపాదన.


