అలసత్వంపై ‘సుప్రీం’ కొరడా | Sakshi Editorial On Supreme Court Comments about Molestation | Sakshi
Sakshi News home page

అలసత్వంపై ‘సుప్రీం’ కొరడా

Sep 30 2026 1:33 AM | Updated on Sep 30 2026 1:33 AM

Sakshi Editorial On Supreme Court Comments about Molestation

నలుగురు గుమిగూడి నిరసనకు దిగితే అతిగా స్పందించటం అలవాటైన ఢిల్లీ పోలీసులకు ఇటీవల అక్కడ వరసగా చోటుచేసుకున్న లైంగిక నేరాల గురించి పట్టింపు లేనట్టు కనబడుతోంది. మొన్న ఆగస్టులో గ్రేటర్‌ నోయిడా నుంచి కశ్మీరీ గేటువరకూ 47 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన బస్సులో ఒక మైనర్‌ బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. వారంరోజుల క్రితం ఆగ్నేయ ఢిల్లీలోని ఆస్తా కుంజ్‌ పార్క్‌ దగ్గర మరో మైనర్‌ బాలికపై ముగ్గురు లైంగిక నేరానికి పాల్పడి హత్యచేశారు. దానికి సమీపంలోని లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థినులైతే తమకు లైంగిక వేధింపులు నిత్యకృత్యమయ్యాయనీ, ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండటం లేదనీ చెబుతున్నారు. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ పరిధిలో ఈనెల మొదటివారం మొదలుకొని ఇప్పటివరకూ డజను వరకూ లైంగిక నేరాలు వెలుగులోకొచ్చాయని మీడియా కథనాలు చెబుతున్నాయి.

అందుకే సోమవారం సర్వోన్నత న్యాయస్థానం పోలీసులపైనా, అధికార యంత్రాంగంపైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇవన్నీ 2012 నాటి నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నాయని వ్యాఖ్యానించించటంతోపాటు శాంతిభద్రతల్ని మెరుగుపరచడానికి నాలుగు సూచనలు చేసింది. వీటిని వచ్చేనెల 5 లోగా అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. డీఎస్‌పీ ర్యాంకుకు తక్కువకాని అధికారులతో జిల్లాలవారీగా ఎక్కడెక్కడ ప్రమాదకర ప్రాంతాలున్నాయో గుర్తించాలన్నది అందులో మొదటి సూచన. అక్కడి పార్కులు, విద్యాసంస్థలు, శివారు ప్రాంతాలు వగైరాలను ఇందుకోసం కూలంకషంగా పరిశీలించాలని తెలిపింది. అలాగే ఇలాంటి ప్రాంతాల్లో రోజంతా గస్తీ ఉండేలా చూడాలని కోరింది. నిఘా కెమెరాల పనితీరు ఎలావుందో తరచు తనిఖీలుచేసి, అవసరమైన మరమ్మత్తులు చేయించాలని, చీకటి ప్రాంతాలు ఎక్కడా ఉండటానికి వీల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. వాహనాల కిటికీలకు నల్లటి తెరలు, ఫిల్ములు లేకుండా చూడాలని ఆదేశించింది. 

నిజానికి వీటిల్లో కొన్ని నిర్భయ ఉదంతం తర్వాత ఏర్పాటైన జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిషన్‌ సిఫార్సుల్లో కూడా ఉన్నాయి. 2012లో నిర్భయ ఉదంతం తర్వాత దేశ వ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలతో యూపీఏ ఆధ్వర్యంలోని కేంద్రం వెంటనే స్పందించి ఈ కమిషన్‌ ఏర్పాటుచేసింది. అది నివేదిక ఇవ్వడానికిముందే ఉరిశిక్షతోసహా కఠిన శిక్షలకు ఆస్కారం కల్పించే నిర్భయ ఆర్డినెన్స్‌ కూడా తెచ్చింది. అప్పట్లోనే ఆ ఆర్డినెన్స్‌ పైనా, దాని స్థానంలో వచ్చిన చట్టంపైనా మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలూ పెదవి విరిచాయి. కేవలం కఠిన శిక్షలు నిర్దేశించినంత మాత్రాన నేరాలు ఆగబోవనీ, వెంటవెంటనే స్పందించే యంత్రాంగం, పకడ్బందీ దర్యాప్తు, న్యాయ స్థానాల్లో వేగంగా విచారణ, శిక్షలు ఉంటేనే నేరం చేయాలంటే భయపడే పరిస్థితులుంటాయనీ ఆ సంఘాలు తెలిపాయి. ఇటీవల ఐపీసీ బదులుగా తీసుకొచ్చిన భారతీయ న్యాయసంహితలో అత్యాచార నేరానికి విధించే శిక్షను ఏడేళ్లనుంచి పదేళ్లకు పెంచారు కూడా. దాదాపు పదిహేనేళ్లు గడిచాక చూస్తే పరిస్థితి మొదటికొచ్చింది. కళాశాల విద్యార్థినులు ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులకు తీరిక లేకపోయింది. కనీసం ఆ ప్రాంతంలో గస్తీ పెంచాలన్న ఆలోచన కూడా రాలేదు. దాని పర్యవసానంగానే బాలిక బలైపోయింది. 

మహిళలపై సమాజంలో శతాబ్దాలుగా పేరుకుపోయిన భావనలు, జెండర్‌ వివక్ష, బాధ్యతాయుత స్థానాల్లో ఉండేవారి వ్యవహారశైలి, ప్రభుత్వాల అలసత్వమూ ఇలాంటి నేరాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయని జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిషన్‌ చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. ఉదంతం జరిగినప్పుడల్లా బాధితుల్నే తప్పుబట్టే సంస్కృతి దేశంలో ఇంకా పోలేదు. వాస్తవానికి నిర్భయ ఉదంతం తర్వాత వెనువెంటనే చర్యలుంటాయన్న భరోసాతో ఫిర్యాదులు చేసేవారి సంఖ్య పెరిగింది. కానీ ఎప్పట్లానే అలసత్వమూ, ఫిర్యాదు ఇచ్చినవారినే తప్పుబట్టే ధోరణి గమనించాక చాలామంది వెనక్కి తగ్గటం మొదలైంది. అసలు నమోదైన కేసుల దర్యాప్తులో పోలీసులు నిరాసక్తత సమస్యను మరింత పెంచుతోంది. నిరుడు వెలువడిన గణాంకాల ప్రకారం ఢిల్లీ పరిధిలో రోజుకు అయిదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి మరింత జటిలం కాకముందే పోలీసులు మేల్కొనాలి. సుప్రీంకోర్టు సూచనలను తక్షణమే అమల్లోకి తీసుకురావాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement