సహజీవన రాగం సాధ్యమా? | Chinese President Xi Jinping arrived in Washington on Wednesday for a three day visit | Sakshi
Sakshi News home page

సహజీవన రాగం సాధ్యమా?

Sep 26 2026 4:11 AM | Updated on Sep 26 2026 4:11 AM

Chinese President Xi Jinping arrived in Washington on Wednesday for a three day visit

ఆర్థిక రంగం మొదలు కృత్రిమ మేధ (ఏఐ) వరకూ అన్నిటా పరస్పరం హోరాహోరీ తలపడుతున్న బలమైన ప్రత్యర్థులు అమెరికా, చైనాలు నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి కరచాలనం చేసుకున్నాయి. మొన్న మేలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌ చైనాలో పర్యటించగా... మూడు రోజుల దౌత్య పర్యటన కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ బుధవారం వాషింగ్టన్‌ వచ్చారు. ఆయనకు రెండురోజులూ ఘనసత్కారాలే దక్కాయి.   కెమెరాల ఎదుట అధినేతలిద్దరూ చిరునవ్వులు చిందించటం కూడా చూడముచ్చట గానే ఉంది.

కానీ రెండు దేశాల మధ్యా ఉన్న సమస్యలు గానీ,వాటి కారణంగా ఇప్పటికే  పేరుకు పోయిన విభేదాలు గానీ చిన్నవేం కాదు. అవి సంక్లిష్టమైనవి, సామరస్య పరిష్కారానికి ఓపట్టాన లొంగనివి. 60వ దశకంలో నాటి రష్యా అధినేత నికితా కృశ్చేవ్‌ ప్రతిపాదించిన ‘మూడు శాంతుల’ ప్రతిపాదనలో ఒకటైన ‘శాంతియుత సహజీవనం’ సూత్రాన్ని గుర్తుకు తెచ్చేలా సంఘర్షణకన్నా సహకారమే ఇద్దరికీ లాభదాయకమని షీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. అప్పట్లో కృశ్చేవ్‌కు రానట్టే జిన్‌పింగ్‌కు కూడా ట్రంప్‌నుంచి అనుకూల స్పందనేమీ రాలేదు. కానీ ఇరుపక్షాలూమరింత సమతూక వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవటానికి కలిసి పనిచేస్తున్నాయని ట్రంప్‌ అన్నారు. 

ఎగుమతులు పెంచటానికీ, ఆర్థికాభివృద్ధి సాధించటానికీ చైనా ప్రభుత్వం అక్కడి తయారీ రంగ పరిశ్రమలకు భారీయెత్తున సబ్సిడీలిస్తోంది. దాంతో చవగ్గా కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఖనిజాలు, ఉక్కు, ఇతర రకాల సరుకులు పాశ్చాత్య మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఈ వ్యూహం అమెరికానూ, పాశ్చాత్య దేశాలనూ తీవ్రంగా దెబ్బ తీస్తోంది. దీన్ని తగ్గించేందుకు తొలి ఏలుబడిలో ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు కొంత వరకూ ఫలితాన్నిచ్చాయి. నిరుడు దీన్ని మరింత నియంత్రించేందుకు 25 శాతం అదనపు సుంకాలు విధించారు. వాటి కారణంగా సరుకుల వరద తగ్గిన మాట వాస్తవమే అయినా, దాదాపు 40 పాశ్చాత్య దేశాల మీదుగా ఆ వస్తువులు వెల్లువెత్తటం ట్రంప్‌కు తలనొప్పిగా మారింది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చైనా ఇదంతా చేస్తోంది. 

ఎవరెంతగా మొత్తుకుంటున్నా విదేశాలతో నిరుడు చైనా వాణిజ్య మిగులు లక్ష కోట్ల డాలర్ల పైమాటే. ఈమధ్యే అమెరికా మాజీ ఆర్థికమంత్రి జానెట్‌ ఎలెన్‌ అంతంతమాత్రంగా ఉన్న అమెరికా పారిశ్రామిక రంగం ‘చైనా షాక్‌’తో మరింత కుంగటం ఖాయమని చేసిన హెచ్చరిక వర్తమాన స్థితికి అద్దం పడుతోంది. చైనా సరుకులపై వ్యామోహంతగ్గించుకోమంటూ జనానికి చేసే హితబోధలేమీ పనిచేయటం లేదు. ‘మాగా’ పేరు చెప్పి ఆవేశంతో ఊగిపోయేవారు సైతం ఈ విషయంలో ట్రంప్‌ మాటల్ని బేఖాతరు చేస్తున్నారు. దాంతో దిక్కుతోచని స్థితిలో చైనాపై గత నెలలో 12.5 శాతం అదనపు సుంకాలు విధించారు. కానీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుకోవాలన్న అవగాహన కుదిరాక గత నెలలో కొన్ని వస్తువులకు దీన్నుంచి మినహాయింపునిచ్చారు. నవంబర్‌తో ముగియాల్సిన ఆ వెసులుబాటును తాజాగా వచ్చే జనవరి 10 వరకూ పొడిగించారు. 

అమెరికాతో సంఘర్షణ ముదిరితే జరిగే పర్యవసానాలేమిటో చైనాకు తెలియంది కాదు. అందుకే అది ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. సుంకాలవల్ల అమెరికాలో కోల్పోయే నష్టాన్ని యూరోప్‌ దేశాల్లో భర్తీచేసుకుంటోంది. అలాగే తమవల్ల నష్టపోయే దేశాల్లో పరిశ్రమలు స్థాపిస్తామని, పెట్టుబడులు పెడతామని ప్రతిపాదిస్తోంది. ఆ దేశాల్లో భారీయెత్తున ఉద్యోగావకాశాలొస్తాయని ఊరిస్తోంది. ఈ వంకనే ప్రపంచాన్ని మభ్యపెట్టి నిలువు దోపిడీచేసిన చరిత్రగల అమెరికా, యూరోప్‌ దేశాలు వీటిని అంత తేలిగ్గాఅంగీకరిస్తాయా? ఈ విషయమై చైనాతో ఈయూ వచ్చేనెలలో చర్చించబోతోంది. 

కానీ ఫలితం ఉంటుందన్న ఆశ మాత్రం లేదు. అమెరికా–చైనా ఘర్షణలు ముదిరితే బాగుండు నని అవి కోరుకుంటున్నాయి. ఆ మాటెలా వున్నా ట్రంప్, జిన్‌పింగ్‌లిద్దరూ చైనాలోనవంబర్‌లో జరిగే ఆసియా పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫోరం, డిసెంబర్‌లో అమెరికాలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుల సందర్భంగా కలుసుకోబోతున్నారు. అప్పటికల్లా వాణిజ్య సమస్య ఉపశమించాలని రెండు దేశాలకూ కోరికైతే ఉంది. కానీ పరస్పర విరుద్ధ శక్తుల మధ్య అదంత సులభం కాదని చరిత్ర చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement