అజేయుడు పుతిన్‌! | Sakshi Editorial On Vladimir Putin | Sakshi
Sakshi News home page

అజేయుడు పుతిన్‌!

Sep 24 2026 12:54 AM | Updated on Sep 24 2026 12:54 AM

Sakshi Editorial On Vladimir Putin

ఎన్నికల బాదరబందీ లేకుండా, ఓటర్ల చుట్టూ ప్రదక్షిణ చేసే ‘ఖర్మ’ పట్టకుండా దేశాధినేతలుగా చలామణి అయ్యేవారు ప్రపంచంలో ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ఆ దేశాల్లో ఇలాంటివారికి మీడియా, సామాజిక మాధ్యమాలూ భజన చేస్తున్నా... ప్రపంచంలో వేరేచోట్ల వారికి నియంతలన్న అపకీర్తి ఉంటుంది. చైనా, ఉత్తర కొరియా వంటి దేశాల్లో మార్క్సిజం పేరు చెప్పి ఈ ఏకపక్ష స్వామ్యం సాగిపోతుంటుంది. రష్యాను దీర్ఘకాలంనుంచి ఏలుతున్న అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సాధించిన అఖండ విజయం మరోసారి ఆయనదైన ముద్ర చూపింది. తన  పదవికి ఎసరుపెట్టే అవకాశం ఉందని భావించిన వారెవరినీ ఆయన వదల్లేదు. ఏమాత్రం ప్రభావితం చేయలేనివారు పోటీలో ఉన్నా పట్టించుకోలేదు. ఆయన  వ్యతిరేకులు అనుమానాస్పద స్థితిలో మరణించ టమో, జైళ్లకు పోవటమో రివాజు. ఈనెల 18 నుంచి 20 వరకూ రష్యా పార్లమెంటు డ్యూమాకు జరిగిన ఎన్నికల్లో ఆయనకే చెందిన ‘యునైటెడ్‌ రష్యా’ పోలైన ఓట్లలో 57.83 శాతం దక్కించుకుంది. 2021లోని 49.82 శాతంతో పోలిస్తే ఇది అధికం. 95 శాతం ఓట్ల లెక్కింపు జరిగాక బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రాథమిక ఫలితాలనుబట్టి దానికి 355 స్థానాలు వచ్చాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీ బలం 343. ఒకప్పుడు అవిచ్ఛిన్నంగా దేశాన్నేలిన వారసత్వంగల కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ రష్యన్‌ ఫెడరేషన్‌ పార్టీకి 13.8 శాతం ఓట్లు, దాదాపు 40 స్థానాలు లభిస్తాయని తేలింది. 2021లో ఆ పార్టీకి 18.93 శాతం ఓట్లు, 57 సీట్లు లభించాయి. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక పార్టీ యాబ్లొకొ పార్టీపై అనర్హత వేటుపడింది.

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించి నాలుగున్నరేళ్లు దాటడం, ఆంక్షల పర్యవసానంగా దేశ ఆర్థికవ్యవస్థ కుంగిపోవటం, ధరలు ఆకాశాన్నంటడం, ప్రత్యర్థి దేశం డ్రోన్‌ దాడుల పరంపరతో చమురు క్షేత్రాలు ధ్వంసం కావటంతో జనం యునైటెడ్‌ రష్యాను వ్యతిరేకించటం ఖాయమని కొందరు అంచనా వేశారు. రష్యా ఎదుర్కొంటున్న సంక్షోభం సామాన్యమైనది కాదు. చమురు క్షేత్రాల ధ్వంసంవల్ల ఉత్పత్తి నిలిచి, పెట్రోల్‌ బంకుల వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. చివరకు తాను విక్రయించిన చమురునే మళ్లీ భారత్‌నుంచి కొనుగోలు చేయకతప్పలేదు. రష్యాలో సంక్షోభం ఏ స్థాయిలో ఉందంటే, మరిన్ని ‘త్యాగాలకు’ సిద్ధపడాలని కొత్త ప్రభుత్వం పౌరుల్ని కోరవచ్చంటు న్నారు. ఆరోగ్య పరిరక్షణ, విద్య వగైరా వ్యయాలను కట్టిపెట్టి యుద్ధంపైనే సర్వశక్తులూ కేంద్రీకరించాలని పుతిన్‌ చాన్నాళ్లుగా భావిస్తున్నారు. ‘యుద్ధ ఆర్థిక వ్యవస్థ’లో సర్వం లయంకావటం సహజమే. ఎన్నికల ప్రక్రియను ఏమార్చటం రష్యాలో సాధారణమే అయినా, ఓట్లేసినవారిలో అత్యధికులు దేశభక్తి, జాతీయత వంటి వ్యామోహాల్లో పడ్డారని కొందరి వాదన. తనకు దేశంపై పూర్తి స్థాయి పట్టు ఉందని... ఎన్నికలైనా, వ్యవస్థలైనా విశ్వసనీయమైనవని చూపటానికి పుతిన్‌ తాపత్రయపడ్డారు. ‘త్యాగాలకు’ సిద్ధపడాలని పిలుపునిచ్చే ఆర్థిక దుఃస్థితి లేనేలేదని, ఇదంతా గిట్టనివాళ్ల ప్రచారమని ఎన్నికలకు ముందు ఆయన ప్రకటించారు. కానీ ఇచ్చిన మాట నిలుపుకుంటారా అన్నది చెప్పలేం.

ఈ ఎన్నికలు బూటకమని, వీటిని తిరస్కరించాలని బ్రిటన్, కెనడా, నార్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే సార్వజనీనంగా ఆమోదించిన ప్రజాస్వామ్య నమూనా అంటూ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నదని చెప్పుకుంటున్న దేశాలు ఆ పదానికి తమ తమ సొంత భాష్యాలు ఇచ్చుకుంటున్నాయి. క్రమం తప్పని ఎన్నికలు, నిర్ణీత వ్యవధిలో చట్టసభల సమావేశాలు, వాటిల్లో అధికార విపక్షాల వాగ్యుద్ధాలు, పరస్పర ఆరోపణలు... ఇవన్నీ ప్రజాస్వామ్యమని చాలా దేశాల్లో జనం నమ్ముతారు. రష్యా వరకూ చూస్తే 2006లో మరణించిన అలెగ్జాండర్‌ లిత్వినెంకో, అన్నా పొలిటికోవ్‌స్క్యా, 2013లో చనిపోయిన బోరిస్‌ బెరెజోవ్‌స్కీ, 2015లో విగతజీవుడైన బోరిస్‌ నెమ్‌సోవ్, రెండేళ్ల క్రితం మరణించిన అలెక్సీ నవాల్నీ అక్కడ ప్రజాస్వామ్యం ఏపాటో చెబుతారు. వీరిలో ఇతరులంతా ఖండాంతరాల్లో అనుమానాస్పదంగా చనిపోతే, నవాల్నీ బందీఖానాలో కన్నుమూశారు. ఏదేమైనా 2031లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పుతిన్‌ గెలుపు ఖాయమని ఈ ఎన్నికలు నిరూపించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement