బ్రిక్స్‌: కొన్ని శేష సంభాషణలు | Sakshi Guest Column On BRICS Summit 2026 | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌: కొన్ని శేష సంభాషణలు

Sep 22 2026 12:47 AM | Updated on Sep 22 2026 12:47 AM

Sakshi Guest Column On BRICS Summit 2026

బ్రిక్స్‌ 2026: దక్షిణాఫ్రికా, ఇండియా, చైనా, రష్యా దేశాల నేతలు

అభిప్రాయం

బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాలు ఒక బృహత్తరమైన విషయం అయినందున అందు గురించి చర్చించుకోవలసినవి అనేకం
ఉంటూనే ఉంటాయి. అందులోనూ ఆ సంస్థ కజాన్‌తో ఆరంభించి రియో డి జనేరో మీదుగా ఢిల్లీ వరకు ఒక కొత్త దశలోకి ప్రయాణిస్తూ వచ్చినపుడు. ఇటు వంటి దశలో మార్గ నిర్దేశనాలను స్థూలమైన రీతిలో ఎన్ని చేసుకున్నా, ప్రశ్నలూ సందేహాలూ కూడా అంతగా మిగిలే ఉండటం సహజం. 

ఐక్యత సాధ్యమేనా?
వాటిలో అన్నింటికన్న ప్రధానమైనది బ్రిక్స్‌ సభ్య దేశాల మధ్య ఐక్యత ప్రశ్న. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఆ దేశాల మధ్య ఏకాభిప్రాయాలు. రెండు, వారికి బ్రిక్స్‌ బయటి దేశాలతో గల సంబంధాలు. ఈ విషయాన్ని కొంత సూటిగా చెప్పుకుందాము. ఢిల్లీ సమావేశాలకు ముందూ, ఆ తర్వాతా పాశ్చాత్య మీడియా, పరిశీల కులతో పాటు ఇక్కడ కూడా పలువురు బ్రిక్స్‌లోని భిన్నత్వాలను చాలా ఎత్తి చూపారు. ఆ కారణంగా ఐక్యత సందేహాస్పదమన్నారు. వారు ఉదాహరించిన వాటిలో ముఖ్యమైనవి భారత–చైనా, ఇరాన్‌ –అరబ్‌ రాజ్యాల వివాదాలు.

ఇవి ముఖ్యమైనవనటంలో సందేహం లేదు. అయితే, అవి ఉన్నప్పటికీ అందరూ ఒక చోట చేరటం, ఏకగ్రీవ ప్రకటనను విడుదల చేయటాన్ని కూడా విమర్శకులు అదే సమయంలో గుర్తించారు. అట్లా జరగటంలో భారతదేశపు దౌత్యనీతి కొంత పనిచేసిన మాట నిజమే అయినా, అంతకుమించిన మౌలిక కారణాలు ఉన్నాయనేది గమనించాలి. మొదటిది, పరస్పర సమస్యలు ఉన్న బ్రిక్స్‌ దేశాలకు కూడా బయటి శక్తుల నుంచి అంతకన్న పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. పరస్పర సమస్యల పరిష్కారం కన్నా బయటి సమస్యల పరిష్కారం పెద్ద సవాలు అవుతున్నది. మొదట 2006లో ‘బ్రిక్‌’ ఏర్పడినా, 2010లో ‘బ్రిక్స్‌’గా మారినా, ఇపుడు 2026లో మరింత విస్తరించినా సభ్య దేశాల మధ్య కొన్ని సమస్యలు ఎప్పుడూ ఉన్నవే. ఉదాహరణకు ఇండియా–చైనా వివాదం. అది 2006 నాటికి కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఒక యుద్ధం, కొన్ని ఘర్షణలు జరిగాయి. అయినప్పటికీ బ్రిక్స్‌లోనే గాక షాంఘై సహకార సంస్థ తదితరాలలోనూ చైనాతో పాటు సభ్య దేశంగా ఉండేందుకు భారత్‌ ఎందుకు అంగీకరించినట్లు?

మూడు ముఖ్య దేశాలు
పైన వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇందులోనే లభిస్తుంది. సభ్య దేశాలకు పరస్పర సమస్యలకన్న బయటి శక్తుల నుంచి ఎదు రవుతున్న సమస్యలు పెద్ద సవాళ్లవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, బయటి శక్తుల నుంచి సమస్యలన్నవి వందల సంవత్సరాల వలస పాలనలతో మొదలై, సామ్రాజ్యవాదపు వివిధ చర్యల రూపంలో నేటికీ కొనసాగుతున్నాయి. అందుకే వీరు ఒకటి అవుతుండటమే గాక, బ్రిక్స్‌ పట్ల అన్ని ఖండాల దేశాలలో ఆకర్షణలు పెరుగు తున్నాయి. కనుక, ఈ విస్తృత చిత్రాన్ని గమనించినప్పుడు, పరస్పర సమస్యలన్నవి భూతద్దంలో చూడవలసినవిగా తోచదు. అయితే, ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ మధ్య సమావేశంలో ‘భిన్నాభిప్రాయాలు విభేదాలుగా మారకూడ’దన్న మాట ఒకటి వచ్చింది. అందులోని రెండు పదాలకు చాలా అర్థం ఉంది. అది ఇక్కడ చర్చించలేము. కానీ, వారు అదే అవగాహనతో ముందుకు సాగుతుండటం మాత్రం గమనించదగ్గది. అందులో పరస్పర ప్రయోజనాలతో పాటు బ్రిక్స్‌ స్ఫూర్తి ఉంది. బ్రిక్స్‌ను చైనా హైజాక్‌ చేస్తుందా అనే ప్రశ్న ఒకటి ఉన్నది గానీ అది వేరే వివరమైన చర్చ.

ఇందుకు పొడిగింపుగా చెప్పుకోవలసింది ఒకటున్నది. బ్రిక్స్‌లో వేర్వేరు ఖండాల నుంచి ప్రధానమైన దేశాలు ఉన్నప్పటికీ, సంస్థకు వెన్నుదన్ను అనదగ్గవి ఇండియా, చైనా, రష్యాలే. ఈ మూడూ ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికపరంగా, సైనికంగా, భౌగోళిక వైశాల్య పరంగా, జనాభా రీత్యా శక్తిమంతమైనవి. రాజకీయంగా చూసి నపుడు భారత్‌ ప్రజాస్వామికమైనది కాగా, తక్కిన రెండు స్థిరమైన వ్యవస్థలు. ఈ ముగ్గురికి కూడా వలస పాలనల కాలం నుంచి, ఆ తర్వాత వర్తమానంలోనూ వర్ధమాన దేశాలతో వెన్నంటి నిలిచిన పేరున్నది. బ్రిక్స్‌ పునాదులు కూడా 2006 నుంచి ఈ 2026 వరకు అవే. వర్ధమాన దేశాలకు బయటి శక్తులతో రాగల కాలంలో ఘర్షణాత్మక స్థితి ఏర్పడే కొద్దీ ఈ సంస్థకు నాయకత్వం వహించి నిలబెట్ట గలది, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించగలది, ఇపుడున్న అంతర్జాతీయ సంస్థలను సంస్కరించి వర్ధమాన దేశాలకు అవకా శాలు కల్పించేట్లు చేయగలది ఈ ముగ్గురి నాయకత్వమే. ఇదే సంద ర్భంలో మరొకటి కూడా చెప్పాలి. వర్ధమాన దేశాలకు బయటి శక్తు లతో రక్షణపరమైన సమస్యలు తలెత్తితే, ఈ ముగ్గురిలో ఇండియా, చైనాలు కాదు గానీ తమ సైన్యాలను పంపి ఆదుకునేందుకు సైతం రష్యా సిద్ధమే. ఇటీవల పశ్చిమ ఆఫ్రికాలో అదే జరుగుతున్నది.

భారత ప్రభుత్వం గురించి దాపరికం లేకుండా మాట్లాడుకోవ లసిన విషయం ఒకటున్నది. ఇండియా బ్రిక్స్‌లో చేరింది కాంగ్రెస్‌ అధికారంలో ఉండిన 2006లో కాగా, బీజేపీ గెలిచిన 2014 నుంచి మోదీ ప్రభుత్వ వైఖరి బయటి ప్రపంచపు దృష్టిలో అనుమానా స్పదంగా మారింది. వైఖరిలో మార్పునకు కారణం దేశ ప్రయోజ నాలు అని చెప్పేవి అయితే కావచ్చు గాక, కానీ అనుమానాస్పదంగా మారింది నిజం. వర్ధమాన దేశాలకు హాని కలిగే విధంగా బయటి శక్తులకు సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తూ పోయారన్న మాటలు ఇంటాబయటా వినిపించాయి. గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమం, వెస్ట్‌ బ్యాంక్‌ ఆక్రమణలు, వెనిజులా అధ్యక్షుని అపహరణ, ఇరాన్‌పై దాడుల సందర్భాలలో ప్రభుత్వ వైఖరులతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇపుడు ఢిల్లీలో వైఖరి కొంత మారుతున్న సూచనలు కన్పించినందున, ఇది ఇక స్థిరపడుతూ పోగలదేమో చూడాలి. బయటి శక్తులతో ఇండియాకు సమస్యలు క్రమంగా పెరుగుతున్నందున అందుకు అవకాశాలైతే ఉన్నాయి. 

అసలు ఆయుధీకరణ
చివరగా చర్చించవలసినవి రెండున్నాయి. స్వేచ్ఛా నౌకా యాన ప్రశ్న, వనరుల ఆయుధీకరణ ప్రశ్న. ఈ రెండూ ఢిల్లీ సమావేశాల సందర్భంగా మరొకమారు ప్రస్తావనకు వచ్చాయి. స్వేచ్ఛాయానం హార్మూజ్‌ దిగ్బంధం నుంచీ, ఆయుధీకరణ అమెరికా అధ్యక్షుని ట్యారిఫ్‌ వార్‌తోనూ మొదలయ్యాయి. హార్మూజ్‌ను ఇరాన్‌ మూసి వేసింది శత్రు దాడుల నుంచి ఆత్మరక్షణకే తప్ప అంతకు ముందు ఎటువంటి మూసివేతలూ లేవు. దాడులు ఆగకుండా హార్మూజ్‌ను తెరవాలని ఒత్తిడి చేయడమంటే తమ ఆత్మరక్షణ సాధనాన్ని వదలుకుని లొంగిపోవలసిందిగా కోరటమే. స్వేచ్ఛాయానమన్న మాట దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ ఉన్నా, బ్రిక్స్‌ చర్చల సంద ర్భం అది కాదు. పోతే, స్వేచ్ఛా యానాన్ని అమెరికా అట్లాంటిక్, పసిఫిక్‌లలో తమ ప్రత్యర్థులకు అనుమతించక పోవటాన్ని ఏమంటాం?అమెరికా అధ్యక్షుడు ట్యారిఫ్‌లను, సాంకేతిక పరికరాల ఎగుమతిని ఆయుధాలుగా మార్చటం మొదలు పెట్టినందునే చైనా, కెనడా, యూరప్‌ వంటివి ఎదురు ట్యారిఫ్‌లతో, కీలకమైన వనరుల ఎగుమతిపై ఆంక్షలతో ఆత్మరక్షణ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీనంతటిలో ఏది ఆయుధీకరణ అవుతుంది, ఏది కాదు? అందు వల్ల, సమస్యకు గల కారణాలను వదలి సమస్యల గురించి మాత్రమే మాట్లాడటంతో పరిష్కారం లభించదు.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement