మార్లిన్ మన్రో అంటే దాదాపుగా హాలీవుడ్ దేవత. జాన్ స్టెయిన్‌బెక్ ఏమో నోబెల్ గౌరవానికి నోచుకున్న నవలా రచయిత. సహజంగానే రచయితలకంటే నటీమణులకే క్రేజ్ ఎక్కువన్నది ఏ ప్రాంతానికైనా వర్తించే సత్యం కాబట్టి, అమెరికా కూడా అందుకు మినహాయింపు కాదు. స్టెయిన్‌బెక్ భార్య తరఫు మేనల్లుడైన ఓ 17 ఏళ్ల కుర్రాడు మార్లిన్ ‘బానిస’. అలాంటివాడికి మార్లిన్‌ను స్టెయిన్‌బెక్ కలిశాడనే ‘ఘోరమైనతప్పిదం’ మేనత్త చేసిందట. ఆ కుర్రాడు దాన్ని నమ్మకపోయినా మామగారి పట్ల అతడి ‘మర్యాద’ ఆకాశాన్నంటింది. ఇక తప్పదన్నట్టుగా, ఆటోగ్రాఫ్ చేసిన ఒక ఫొటోను పంపమంటూ 1955లో న్యూయార్క్ నుంచి మార్లిన్‌కు ఓ లేఖ రాశాడు స్టెయిన్‌బెక్. భాష, శైలి, చమత్కారం వల్ల పదేపదే వైరల్ అయ్యే ఈ లేఖను ఈమధ్యే ప్యాట్రిక్ ఓషానెసీ అనే వ్యాపారవేత్త ‘ఎక్స్’లో పంచుకున్నాడు. దీన్నే శశి థరూర్ ఓ నాలుగేళ్ల కింద షేర్ చేశాడు. అయితే, ఇందులోని శైలి స్టెయిన్‌బెక్‌దే అయినా, నిజంగా ఆయనే రాశాడనేందుకు ఆధారాలు లేవనే సందేహాలూ ఉన్నాయి. స్టెయిన్‌బెక్‌ది కాకపోతే స్టెయిన్‌బెక్ అంతటివాడు ఆవహించి రాసినదై ఉండాలి.
చరిత్రలో కొన్ని అబద్ధాలు ఎంత అందంగా ఉంటాయంటే అవి నిజమైతే బాగుండనిపిస్తుంది. ఒక మహానుభావుడి చేతిరాత కనిపిస్తే, ఒక నియంత రహస్య డైరీ దొరికితే, ఒక గొప్ప కవి ప్రేమలేఖ చేతికి చిక్కితే– అవి నిజం కాదనే అనుమానమే అన్యాయంగా తోస్తుంది. అందుకే చరిత్రలోని కొన్ని మోసాలు కేవలం మోసాలుగా మిగిలిపోలేదు. సాహిత్యాన్నీ, జర్నలిజాన్నీ, పరిశోధననూ, మనుషుల ఊహాశక్తినీ పరీక్షించిన అద్భుతమైన కథనాలుగా మిగిలిపోయాయి. 1983లో జర్మన్ పత్రిక స్టెర్న్ 1932 నుంచి 1945 వరకు అడాల్ఫ్ హిట్లర్ రాసినట్లుగా చెప్పిన దాదాపు అరవై సంపుటాల డైరీలు దొరికాయని ప్రకటించింది. యుద్ధం చివరి దశలో హిట్లర్ వ్యక్తిగత వస్తువులను తరలిస్తున్న విమానం కూలిపోవడంతో ఆ డైరీలు బయటపడ్డాయని కథనం. కానీ ఫోరెన్సిక్ పరీక్షలు కాగితం, సిరా రెండో ప్రపంచ యుద్ధం తర్వాతివని తేల్చాయి. కోన్రాడ్ కుజావు అనే చిత్రకారుడి సృజనాత్మక మోసం అలా బయటపడింది.
ముందు వాటిని అసలువని ఎందుకు నమ్మారు? అవి నిజమైతే బాగుండనే భావన మనుషులను అమాయకులను చేయడంవల్ల. ఇదే బలహీనత అబ్రహాం లింకన్ ప్రేమలేఖల ఉదంతంలోనూ కనబడుతుంది. 1928లో అమెరికా పత్రిక అట్లాంటిక్ మంత్లీలో ‘లింకన్ ద లవర్’ పేరుతో ఆన్ రట్లెడ్జ్‌కు లింకన్ రాసినట్టుగా చెప్పిన లేఖలు ప్రచురితమయ్యాయి. కానీ వాటి భాష, శైలి, ఆ కాలపు పదప్రయోగాలు అనుమానాస్పదంగా తోచాక రచయిత్రి విల్మా ఫ్రాన్సిస్ మైనర్ చేసిన సాహిత్య మోసం బయటపడింది. ఇక 18వ శతాబ్దం చివర్లో లండన్‌లో విలియం హెన్రీ ఐర్లాండ్ అనే కవి ఏకంగా షేక్‌స్పియర్ స్వహస్తాలతో రాసిన లేఖలు, అన్నే హాత్‌వేకి రాసిన ప్రేమలేఖలు, కింగ్ లియర్, హామ్లెట్ వంటి రచనల చేతిరాత ప్రతులతోపాటు షేక్‌స్పియర్ సరికొత్త నాటకం ‘వాటిగెర్న్ అండ్ రొవెనా’ను ‘కనుగొన్నాడు’. ఇంత కష్టపడి ఎందుకు నకిలీవి సృష్టిస్తారంటే దానికున్న మార్కెట్, సంచలన యావ, సరదా. అంతెందుకు, సాంస్కృతిక వారసత్వపు వెన్నువిరవకుండా భారతదేశాన్ని జయించలేమని ప్రచారంలో ఉన్న 1835 ఫిబ్రవరి 2 నాటి లార్డ్ మెకాలే ప్రసంగం కూడా ఉత్తిదేనని కథనాలు వెలువడ్డాయి. భావజాల పరంగా మెకాలే అలాంటివాడే కావొచ్చుగానీ ఆ లేఖ మీద మాత్రం వివాదం లేకుండా లేదు.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, స్టీఫెన్ థేలర్ అనే ఏఐ పరిశోధకుడు ‘ఎ రీసెంట్ ఎంట్రన్స్ టు ప్యారడైజ్’ అనే చిత్రాన్ని డాబుస్ ఏఐ టూల్‌తో గీయించి, ఆ చిత్ర సృష్టికర్తగా దాన్నే అంగీకరించాలని పెట్టుకున్న కాపీరైటు అర్జీని భారత ప్రభుత్వ కాపీరైట్ కార్యాలయం ఇటీవలే కొట్టేసింది. దాన్ని ఒరిజినల్ వర్క్‌గా అంగీకరిస్తూనే, మానవ ప్రమేయం లేని ఈ కళకు కాపీరైట్ ఇవ్వడానికి తిరస్కరించింది. తనను సృష్టికర్తగా చెప్పుకోవడానికి థేలర్ అంగీకరించలేదు. కృత్రిమ నకిలీల కాలంలో ఆ మేరకు ఆయన సహజ అభినందనకు అర్హుడు.


