బ్రిటన్‌లో వేర్పాటు భేరి! | Sakshi Editorial On separations in Britain | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లో వేర్పాటు భేరి!

Sep 17 2026 1:23 AM | Updated on Sep 17 2026 1:23 AM

Sakshi Editorial On separations in Britain

బ్రిటిష్‌ వలస పాలకులు తాము తప్పుకున్న మరుక్షణం భారత్‌ చిన్నాభిన్నం కావటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పుడు ఆ దేశమే ముక్కలయ్యే స్థితి ఏర్పడింది. మొన్న సోమవారం స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్‌ ఐర్లాండ్‌ ఫస్ట్‌ మినిస్టర్‌లు(మన దగ్గర సీఎంల హోదాతో సమానం) అనధికార సమావేశం జరిపి, తమ స్వాతంత్య్ర ఆకాంక్షను వ్యక్తం చేసే ప్రకటనపై సంతకాలు చేశారు. దేశం కలిసుండాలా, విడిపోవాలా అనేది... అందుకు అనుసరించాల్సిన పద్ధతేమిటన్నది లండన్‌లోని జాతీయ పార్లమెంటు మాత్రమే నిర్ణయించాల్సిన అంశం కాబట్టి, ఇప్పటికప్పుడు దీనివల్ల జరిగేదేమీ ఉండదు. కానీ ఆర్థిక సంక్షోభాలు అగ్రరాజ్యాల్ని సైతం ఎలా కుదిపేస్తున్నాయో చెప్పడానికి తాజా పరిణామం ఉదాహరణ. అమెరికాపై పాతికేళ్లనాడు ఉగ్రదాడి జరిగినప్పుడు 3,000 మందిని పొట్టనబెట్టుకోవడం మినహా ఆ ఉగ్రవాదులు సాధించిందేమిటన్న ప్రశ్న వినబడింది. అటు తర్వాత అమెరికా సవ్యంగావుంటే ఉగ్రవాదం అంతరించేది. కానీ జరిగిందంతా అందుకు భిన్నం. అప్పట్లో అందరినుంచీ అమెరికాకు మద్దతు లభించింది. కొత్తగా అధికారంలోకొచ్చిన రష్యా అధినేత పుతిన్‌ అమెరికా ప్రారంభించిన ‘ఉగ్రవాదంపై యుద్ధా’నికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, తాలిబన్ల వేటకు మధ్య ఆసియాలోని పూర్వపు సోవియెట్‌ సైనిక స్థావరాల వినియోగానికి ఉదారంగా అనుమతించారు. నాటో ఆవిర్భవించి అప్పటికి యాభైయ్యేళ్లు దాటగా... అందులోని మొదటి క్లాజు ‘సమష్టి రక్షణ’ను తొలిసారి ఉపయోగించి ఆ సంస్థ అమెరికాకు బాసటగా నిలిచింది. ఇలా చిన్నా పెద్దా దేశాలన్నీ తాలిబన్‌ల వేటకు తోడ్పడ్డాయి. 

కానీ దీన్ని అమెరికా దుర్వినియోగం చేసింది. మానవహక్కుల ఉల్లంఘన సంగతలా వుంచి ఇరాక్‌ మొదలు పలు దేశాలపై విరుచుకుపడి ధ్వంసరచనకు, మారణహోమాలకు పాల్పడింది. లక్షల కోట్ల డాలర్లను మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేసింది. ప్రతీకారేచ్ఛ క్రమంలో తాను దివాలా తీస్తున్నాననీ, నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నాననీ, చైనాపై కన్నేసి వుంచాలన్న సంగతి మరిచాననీ గ్రహించలేక పోయింది. ఉగ్రదాడికి ముందు మిగులు బడ్జెట్‌లో ఉన్న అమెరికా ఇప్పుడు 40 లక్షల కోట్ల డాలర్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయింది. కరోనా మహమ్మారి పాత్ర కూడా ఇందులో ఉండొచ్చు గానీ... విచక్షణారహిత యుద్ధాల పరంపరే దాన్ని ఈ స్థితికి చేర్చింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టు యుద్ధాల్లో పాలుపంచుకున్న నాటో బలహీన పడింది. అన్ని దేశాలూ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నాయి. ఈ కష్టాల పరంపరనుంచి గట్టెక్కటం కోసమే ఆరేళ్ల క్రితం ఈయూ నుంచి బ్రిటన్‌ బయటికొచ్చింది. బ్రెగ్జిట్‌ రిఫరెండమ్‌లో దీన్ని నార్తర్న్‌ ఐర్లాండ్, స్కాట్లాండ్‌ ప్రజానీకం తిరస్కరించారు. కానీ వారి అభీష్టానికి విలువ లేకుండాపోయింది. ఇప్పుడు బ్రిటన్‌నుంచి విడిపోవటంతోపాటు ఈయూలో చేరటం కూడా ఈ ముగ్గురు అధినేతల ఎజెండా. చారిత్రకంగా మన రాష్ట్రాల కన్నా వేల్స్, నార్తర్న్‌ ఐర్లాండ్, స్కాట్లాండ్‌ భిన్నమైనవి. వేల్స్‌ను 13వ శతాబ్దంలో ఇంగ్లండ్‌ ఆక్రమించుకుంది. రాచరికాలు చుట్టరికం కలుపుకోవటంతో స్కాట్లాండ్,ఇంగ్లండ్‌ కలిసి ప్రయాణించి వందేళ్ల తర్వాత కలిసి 1703లో గ్రేట్‌ బ్రిటన్‌గా ఏర్పడ్డాయి. 1801లో దానిలో చేరిన ఐర్లాండ్‌ 1921లో విడిపోయింది. కానీ ఉత్తర ప్రాంతంలోని ఆరు కౌంటీలు యూకేలోనే కొనసాగుతామన్నాయి. 

బ్రిటన్‌ తప్పుడు నిర్ణయాలతో అన్ని ప్రాంతాలనూ భ్రష్టు పట్టించటంతోపాటు, వాటి అధికారాలను కుదిస్తూవచ్చింది. పన్నుల ఆదాయాన్ని సరిగా పంచక 90 దశకం చివర్లో హామీ ఇచ్చిన స్వయంప్రతిపత్తి హోదాకు ముప్పు తెస్తోందన్నది వాటి అభిప్రాయం. నిరుద్యోగం, జనాభా క్షీణతపై తమకు సరైన నిర్ణయాధికారాలు లేవని వాటి ఫిర్యాదు. సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడైనా సక్రమంగా వ్యవహరించటం చేతకాకపోతే అవి మరింత ముదురుతాయి. ఫెడరల్‌ వ్యవస్థను నీరుగార్చి ప్రశాంతంగా మనుగడ సాగించా లనుకోవటం చెల్లదని బ్రిటన్‌ పాలకులు గుర్తించకపోతే... ఇప్పటికి కేవలం రాజకీయ హెచ్చరికగానే తలెత్తిన ఈ నిరసన ఆ ప్రాంత జనాభాను తాకడానికి ఎన్నాళ్లో పట్టదు. అప్పుడు బ్రిటన్‌ లండన్‌గా మిగిలిపోక తప్పదు. చేసిన పాపాలు శాపాలై వెంటాడ తాయంటారు. మనతో సహా అనేక దేశాలను పీల్చిపిప్పిచేసిన బ్రిటన్‌ ఇప్పుడు ఇల్లు చక్కదిద్దుకోగలదా అన్నది వేచిచూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement