లండన్‌కు సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవాల్లో ఒకటైన “లండన్ నగర స్వేచ్ఛా పౌరసత్వం” (Freedom of the City of London) అవార్డును తెలంగాణకు చెందిన గణేశ్ కుప్పాల స్వీకరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గణేశ్ కుప్పాల ఉద్యోగరీత్యా లండన్‌లో స్థిరపడ్డారు. కాగా సెప్టెంబర్ 16న గణేష్ కుప్పాల ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ “ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్” గౌరవాన్ని అధికారికంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా, చట్టప్రకారం అవసరమైన ప్రతిజ్ఞ చేసి, డామే సూసన్ కరోల్, కరోలిన్ లూసి సమక్షంలో ఆయనను Freedom of the Cityలో అధికారికంగా చేర్చారు. ఫ్రీమెన్ హక్కుల కొనుగోలు, వారి అధికారిక ప్రవేశాలకు సంబంధించిన I అక్షరంతో గుర్తించబడిన అధికారిక రిజిస్టర్ పుస్తకంలో, కింగ్ చార్లెస్ III పాలనలోని 6వ సంవత్సరంలో నమోదు చేయబడింది. లండన్ నగర చరిత్రలో ఎంతో విశిష్టమైన ఈ గౌరవాన్ని అందుకున్న ప్రముఖుల జాబితాలో కింగ్ చార్లెస్ III, క్వీన్ ఎలిజబెత్ II, ఫ్లోరెన్స్ నైటింగేల్, జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నారు.
తాజాగా ఇంతటి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా గణేష్ కుప్పాల నిలిచారు. అంతేకాదు తెలంగాణకు చెందిన తొలి వ్యక్తిగా లండన్‌లో అరుదైన గౌరవం పొందిన వ్యక్తిగా నిలిచారు ఈ ఘనత తెలంగాణ ప్రజలకు, తెలుగు వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి ఎంతో గర్వకారణం. గణేష్, ఒక గొప్ప గౌరవాన్ని అందుకోవడమే కాకుండా, తెలంగాణ మరియు తెలుగు సమాజానికి ఒక చారిత్రాత్మక గుర్తింపును తీసుకువచ్చారు.
ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ ఫ్రీడమ్ (Freedom of the City of London) గౌరవాన్ని అందుకున్న గణేష్ కుప్పాలను పలువురు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో పాటు మాజీ ఎంపీ అభినందించారు. గణేశ్‌ను అభినందించిన వారిలో ఎంపీ సీమా మల్హోత్రా, ఎంపీ జస్ అథ్వాల్, ఎంపీ వెస్ స్ట్రీటింగ్, మాజీ యూకే ఎంపీ వీరేంద్ర శర్మ ఉన్నారు.
ఇదీ చదవండి: వడ్డీ రేట్లు పెంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్


