అమెరికా పౌరులే టార్గెట్‌.. కాల్‌సెంట‌ర్ల‌పై ఈడీ మెరుపు దాడులు | ED Raids-Patiala, Pune and Chandigarh unearth call centre syndicate | Sakshi
Sakshi News home page

అమెరికా పౌరులే టార్గెట్‌.. కాల్‌సెంట‌ర్ల‌పై ఈడీ మెరుపు దాడులు

Sep 16 2026 10:53 PM | Updated on Sep 16 2026 11:01 PM

ED Raids-Patiala, Pune and Chandigarh unearth call centre syndicate

Photo Credit: Twitter

అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న నెట్‌వ‌ర్క్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి దెబ్బ కొట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)- 2002 లోని సెక్షన్ 17 కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు సెప్టెంబర్ 15న పటియాలా, పుణె, చండీగఢ్‌లోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన, పక్కా సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ సోదాల్లో అంతర్జాతీయ మోసాల ముఠా గుట్టు రట్టయింది.

సోదాల సమయంలో ఈడీ అధికారులు పటియాలాలో రెండు, పుణెలో ఒకటి చొప్పున మొత్తం మూడు ప్రత్యక్ష (లైవ్) కాల్ సెంటర్లను గుర్తించారు. అధికారులు సోదాలు జరుపుతున్న సమయంలో ఈ సెంటర్లలో సుమారు 220 మంది ఉద్యోగులు విధుల్లో ఉండటం గమనార్హం. వర్క్ స్టేషన్లు, క్యూబికల్స్, కంప్యూటర్లు, హెడ్సెట్లు, వీఓఐపీ ఆధారిత సిస్టమ్లతో ఇవి నడుస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గుర్తింపు, వారికి అప్పగించిన బాధ్యతలు, వారిని వెనుక ఉండి నడిపిస్తున్న ప్రధాన సూత్రధారుల వివరాలను అధికారులు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

పటియాలా, పుణె కేంద్రాలుగా సాగుతున్న ఈ నకిలీ కాల్ సెంటర్ల ప్రతినిధులు అమెరికా పౌరులకు ఫోన్లు చేసి, వివిధ తప్పుడు కారణాలు చెబుతూ భయభ్రాంతులకు గురిచేసేవారు. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులను చెల్లించేలా ప్రేరేపించి మోసాలకు పాల్పడేవారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇలా అమెరికన్ డాలర్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన నిధులను భారతీయ కరెన్సీగా మార్చే ప్రక్రియను ఒక ముఠా నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

చండీగఢ్‌లోని ఒక నివాస ప్రాంగణంలో జరిగిన సోదాల్లో ఈ మొత్తం దందాకు సంబంధించిన ప్రధాన నియంత్రణ వ్యవస్థ బయటపడింది. పటియాలాలోని కాల్ సెంటర్ల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, అమెరికా నుంచి వచ్చిన అక్రమ ఆదాయాన్ని స్థానిక కరెన్సీలోకి మార్చే ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడానికి ప్రధాన సూత్రధారి ఈ చండీగఢ్ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అక్కడ నిధుల పంపిణీకి సంబంధించిన అనేక డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి.

ఇదీ చదవండి: మోదీ ‘శ్రీకృష్ణుడు’, నేను సుధామ.. ప్రధాని ఫ్రెండ్‌ భావోద్వేగ లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement