పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం! | NRI Malaika Chitre Killed After Train Hits Them on NYC Subway Tracks | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌: పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!

Sep 15 2026 9:05 AM | Updated on Sep 15 2026 10:44 AM

NRI Malaika Chitre Killed After Train Hits Them on NYC Subway Tracks

న్యూయార్క్‌ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.  పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్‌ నవమ్‌ కౌల్‌ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

లోయర్‌ మన్‌హాటన్‌లోని స్ప్రింగ్‌ స్ట్రీట్‌ సబ్‌వే స్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సౌత్‌ వింగ్‌ వైపు వెళ్తున్న నంబర్‌ 4 రైలు పట్టాలపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత రైలులో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను బయటకు తరలించారు.

ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో..
మలైకా చిత్రే న్యూజెర్సీలోని డేటన్‌కు చెందినవారు. అకాడియా ఫార్మాస్యూటికల్స్‌లో ఆపరేషన్స్‌ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. నవమ్‌ కౌల్‌ సైరేవిల్లేకు చెందినవారు కాగా.. బ్లూమ్‌బర్గ్‌లో ఫైనాన్షియల్‌ డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ రట్జర్స్‌ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. దాదాపు ఒకే సమయంలో అక్కడి నుంచి పట్టాలు పొందారు.

ఈ విషాదంతో వాళ్ల సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నవమ్‌ ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవాడని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్‌ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. మలైకా తెలివైన, చురుకైన విద్యార్థినిగా తమకు తెలుసని ఆమె కుటుంబానికి సమీపంలోని పొరుగువారు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్‌గా మారిన వీడియో..
ఈ ఘటనకు ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌గా మారింది. అందులో మలైకా, నవమ్‌ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. రైలు వస్తున్న సమయంలోనూ వారు అక్కడే ఉన్నారు. అయితే రైలు డ్రైవర్‌ మాత్రం.. మలైకా నవమ్‌ను తన వైపునకు లాగుతున్నట్లు, ఆమె నవ్వుతున్నట్లు కనిపించిందని చెప్పినట్లు సమాచారం.

ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయి ఉండొచ్చని, ఆమెను కాపాడేందుకు మరొకరు పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రైలు డ్రైవర్‌ వారిని గమనించి అత్యవసర బ్రేకులు వేసినా.. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో ఆపడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.

మత్తులో ఉన్నారా?
ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం లేదంటే ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. అయితే ఆత్మహత్య కోణాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆ యాక్సిడెంట్‌తో స్పాట్‌లోనే చనిపోయేదాన్ని!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement