అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టు ద్వారా ఓటు వేసే అమెరికన్లకు ఇకపై కొత్త నిబంధనలు పెట్టాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నానికి కోర్టు అడ్డుకట్ట వేసింది. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం భావించినా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు అనుమతించలేదు. దీంతో మెయిల్ బ్యాలెట్లపై ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న మార్పులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి.
ట్రంప్ మార్చిలో జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆధారంగా యూఎస్ పోస్టల్ సర్వీస్ (USPS) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. మెయిల్ బ్యాలెట్లు పొందే ఓటర్ల జాబితాలను రాష్ట్రాలు పోస్టల్ సర్వీస్‌కు అందించాలి. అలాగే బ్యాలెట్లను పంపేందుకు, తిరిగి స్వీకరించేందుకు USPS ఆమోదించిన ప్రత్యేక కవర్లనే ఉపయోగించాలి. వాటిపై ప్రత్యేక బార్‌కోడ్ ఉండాలి. రాష్ట్రాలు అందించే జాబితాలో పేరు లేని ఓటర్ల బ్యాలెట్లను లేదంటే నిబంధనలకు అనుగుణంగా లేని బ్యాలెట్లను పోస్టల్ సర్వీస్ తిరస్కరించే అవకాశం ఉండేది.
కోర్టుల తలుపు తట్టిన రాష్ట్రాలు
ఈ నిబంధనలపై డెమొక్రాట్ల పాలనలో ఉన్న పలు రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీతో పాటు ఓటింగ్ హక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కొత్త నిబంధనల వల్ల చట్టబద్ధంగా ఓటు వేసే వేలాది మంది ఓటర్ల బ్యాలెట్లు కూడా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, ఎన్నికల సమయంలో గందరగోళం తలెత్తుతుందని వారు వాదించారు.
బోస్టన్‌లోని ఫెడరల్ జడ్జి ఇందిరా తల్వానీ సెప్టెంబర్ 4న ఈ నిబంధనల అమలును నిలిపివేశారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్రాలకే ప్రధాన అధికారం కల్పించే అమెరికా రాజ్యాంగానికి ఈ నిబంధనలు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త విధానాలను అమలు చేయడం రాష్ట్రాలకు ఆచరణాత్మకంగా కూడా కష్టమని తెలిపారు.
దీనిపై ట్రంప్ ప్రభుత్వం అప్పీల్ చేసినా.. 1వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కూడా దిగువ కోర్టు ఆదేశాలను నిలిపివేయడానికి నిరాకరించింది. కొత్త నిబంధనల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని, అదే సమయంలో ఓటింగ్ మోసాలను అడ్డుకోవడంలో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ
కింది కోర్టులతో చుక్కెదురు కావడంతో.. ట్రంప్ ప్రభుత్వం సెప్టెంబర్ 6న అత్యవసర పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మెయిల్ వ్యవస్థను ఎన్నికల మోసాలకు ఉపయోగించకుండా అడ్డుకోవడానికి ఈ నిబంధనలు అవసరమని వాదించింది. అయితే సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో దిగువ కోర్టు విధించిన నిషేధం కొనసాగనుంది.
ఈ నిర్ణయంపై ఇద్దరు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనలపై ప్రభుత్వం చేస్తున్న అప్పీల్‌లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అలిటో అభిప్రాయపడ్డారు. మరోవైపు జస్టిస్ బ్రెట్ కవనాగ్.. USPSకు ఇలాంటి నిబంధనలు రూపొందించే అధికారం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నప్పటికీ, 2026 ఎన్నికలకు ముందు రాష్ట్రాలు, స్థానిక ఎన్నికల అధికారులు వాటిని అమలు చేసేందుకు తగిన సమయం లేదన్నారు.
మెయిల్ ఓటింగ్‌పైనే ఎందుకింత ఫోకస్?
అమెరికా ఎన్నికల్లో మెయిల్ ద్వారా ఓటింగ్‌కు గణనీయమైన ప్రాధాన్యం ఉంది. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మెయిల్ ఓటింగ్ అందుబాటులో ఉంది. 29 రాష్ట్రాల్లో ఎలాంటి కారణం చెప్పకుండానే ఓటర్లు మెయిల్ బ్యాలెట్ కోరుకోవచ్చు. మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిగా మెయిల్ విధానంలోనే జరుగుతున్నాయి.
డెమొక్రాటిక్ ఓటర్లు మెయిల్ బ్యాలెట్లను రిపబ్లికన్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తారని పలు సర్వేలు సూచిస్తున్నాయి. దీంతో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు మెయిల్ ఓటింగ్‌పై విధించే ఆంక్షలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్‌పై నియంత్రణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సమయంలో ఈ తీర్పు వెలువడింది.
ట్రంప్ చాలాకాలంగా మెయిల్ ఓటింగ్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆయన గతంలో చేసిన పలు ఆరోపణలకు ఆధారాలు లేవని విమర్శలు వచ్చాయి. ఆసక్తికరంగా.. ట్రంప్ స్వయంగా కూడా గతంలో మెయిల్ ద్వారా ఓటు వేశారు.
మెయిల్ బ్యాలెట్లపై పోరాటం ట్రంప్ పరిపాలనకు, రాష్ట్రాల అధికారాలకు మధ్య జరుగుతున్న విస్తృత న్యాయపోరులో మరో కీలక పరిణామంగా మారింది. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉండాలన్న ప్రశ్నను కూడా ఈ వివాదం మరోసారి ముందుకు తెచ్చింది.
ఇదీ చదవండి: అంతా బూటకం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


