ఒరంగుటాన్‌ కేసు ఒక హెచ్చరిక : జాతీయ భద్రతా ముప్పు | BJD Flags National Security Risks Near Odisha Defence Installations on Orangutan Case | Sakshi
Sakshi News home page

ఒరంగుటాన్‌ కేసు ఒక హెచ్చరిక : జాతీయ భద్రతా ముప్పు

Sep 14 2026 4:44 PM | Updated on Sep 14 2026 4:44 PM

  BJD Flags National Security Risks Near Odisha Defence Installations  on Orangutan Case

భువనేశ్వర్‌: బాలాసోర్‌ జిల్లాలోని ఒక అడవి ప్రాంతంలో అంతరించిపోతున్న 5 ఒరాంగుటాన్‌ పిల్లల జాడ రాజకీయ దుమారం రేపుతోంది. భారత దేశ తూర్పు సరిహద్దుల వెంబడి తీవ్రమైన జాతీయ భద్రతా లోపాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సంఘటనపై భొగరాయ్‌ బిజూ జనతా దళ్‌ (బీజేడీ) ఎమ్మెల్యే గౌతమ్‌ బుద్ధ దాస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)లతో సహా ప్రముఖ జాతీయ దర్యాప్తు సంస్థలచే తక్షణమే సంయుక్త విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాలాసోర్‌ జిల్లాలోని అడవుల్లో లభించిన సంఘటనపై గత 6 రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) మరియు అటవీ శాఖ దర్యాప్తు బృందం నిందితులను, వాహనాలను గుర్తించడంలో విఫలమైందని గౌతమ్‌ బుద్ధ దాస్‌ విమర్శించారు. 

ఇదీ  చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్‌ కీలక ప్రకటన

ఆందోళనకరం 
ఈ నేపథ్యంలో దీన్ని చాలా పెద్ద సమస్యగా ముఖ్యమంత్రి ప్రకటించగా ఇందులో ఒక అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉందని అటవీ శాఖ మంత్రి పేర్కొనడం ఎమ్మెల్యే ఉదహరించారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది కేవలం ఒరంగుటాన్‌లకు మాత్రమే పరిమితం కాదు. వన్య ప్రాణుల అక్రమ రవాణా అతీతంగా విస్తరించి, జాతీయ భద్రతలో తీవ్రమైన లోపాన్ని సూచిస్తోంది. ఈ ప్రాంతంలో చాంద్‌ పూర్, ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపం వంటి సున్నితమైన రక్షణ స్థావరాలు ఉన్నాయి. అందువల్ల ఈ సమస్య జాతీయ భద్రతకు సంబంధించినదని వేలెత్తి చూపారు. మిజోరం, పశి్చమ బెంగాల్, దిఘా నుంచి సముద్ర మార్గాల ద్వారా లేదా పర్యవేక్షణ లేని గ్రామీణ సరిహద్దు రహదారుల ద్వారా అంతర్జాతీయ సరిహద్దుల గుండా భొగరాయ్‌లోకి అంతరించిపోతున్న జాతిని అక్రమంగా రవాణా చేసినట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే వాస్తవమైతే ఈ రవాణా మార్గాలను శత్రు వర్గాలు, ఉగ్రవాదులు, ఆయుధాలు, అక్రమ మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీని రవాణా చేయడానికి తేలికగా ఉపయోగించుకోవచ్చు. బంగ్లాదేశీయులు ఇప్పటికే రాష్ట్రంలోకి చొరబడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: పారాచూట్‌ ఫెయిల్‌: ఎముకలన్నీ విరిగి, పైలట్‌ 50 గంటల తర్వాత

ఇదే విధమైన ఆందోళనలను ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ వ్యక్తం చేశారు. అక్రమ రవాణాకు గురైన ఒరాంగుటాన్‌ శిశువులను స్మగ్లర్లు  పట్టుబడతామనే భయంతో వదిలివేసి ఉంటారని పేర్కొన్నారు. వారిని తక్షణమే గుర్తించి తగిన దీర్ఘకాలిక చర్యలను చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ఒరాంగుటాన్‌ లభ్యతపై కేంద్ర దర్యాప్తు బృందాల దర్యాప్తును తిరస్కరించింది. ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత సున్నితంగా వ్యవహరిస్తుంది. దర్యాప్తు ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్‌టీఎఫ్, డబ్ల్యూసీసీబీ సంస్థలు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి, దోషులను అరెస్టు చేయగల పూర్తి సామర్థ్యం ఉన్న వృత్తిపరమైన సంస్థలు అని బీజేపీ ఎమ్మెల్యే ఇరాసిష్‌ ఆచార్య అన్నారు. జంతువుల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. భువనేశ్వర్‌ నందన్‌కానన్‌లో 5 ఒరాంగుటాన్లు సురక్షితంగా ఉన్నాయి. వాటికి మంచి సంరక్షణ అందుతోందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement