22 మంది సిబ్బంది జాడ గల్లంతు
పారాదీప్: పనామా జెండాతో వెళ్తున్న సరకు రవాణా నౌక ‘ఎంవీ ఓషన్ విన్నర్’ శనివారం బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఒడిశా తీరం నుంచి 240 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ నౌకలోని సిబ్బందిలో 22 మంది జాడ గల్లంతైంది. సిబ్బందిలో 20 మంది చైనీయులు, ఒక బంగ్లాదేశీ, ముగ్గురు మయన్మార్ వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఒడిశా నుంచి 72,100 మెట్రిక్ టన్నుల ఇనుమ ధాతువును నింపుకుని సింగపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెల్సి భారత తీర గస్తీ దళం, భారత నావికాదళం వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలెట్టాయి. సముద్రజలాల నుంచి ఇద్దరిని కాపాడినట్లు ఉన్నతాధికారి తెలిపారు. సమీపంలోని మరో నౌక సైతం ఈ అన్వేషణ, సహాయక కార్యక్రమంలో పాలుపంచుకుంటోంది.


