తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అమెరికా వెళ్లేందుకు కేంద్రం రాజకీయ క్లియరెన్స్ నిరాకరించింది. దీనిపై పెద్ద పొలిటికల్ చర్చే నడుస్తోంది. అయితే, విదేశీ పర్యటనకు కేంద్రం నుంచి అనుమతి రాకపోవడం రేవంత్‌కు మాత్రమే ఎదురైన పరిణామం కాదు. గతంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు సీఎంల విదేశీ పర్యటనలకు కూడా కేంద్రం అనుమతి నిరాకరించిన సందర్భాలున్నాయి. దీంతో ఇప్పుడు రేవంత్ టూర్ వ్యవహారంతో పాటు ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు రాజకీయ క్లియరెన్స్ ఎందుకు అవసరం? కేంద్రం ఎప్పుడు నో చెబుతుంది? గతంలో ఎవరెవరి పర్యటనలు ఆగిపోయాయి? అనే చర్చ మొదలైంది.
తాజాగా రేవంత్‌రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన కోసం బయలుదేరారు. ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమంలో భాగంగా పెట్టుబడులు, విద్యా సంస్థల భాగస్వామ్యాలు, తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలను తీసుకురావడమే పర్యటన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ.. అమెరికా పర్యటనకు మాత్రం రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 23న ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలను రాజకీయ క్లియరెన్స్ ఇచ్చే ముందు MEA పరిశీలిస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పర్యటనలో ప్రతిపాదించిన కార్యక్రమాలు సీఎం పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినవిగా ఉండాలి అని చెప్పారు. రేవంత్ అమెరికా పర్యటనకు సంబంధించిన ప్రతిపాదిత కార్యక్రమం ఆ ప్రమాణాలకు సరిపోలలేదని, అందుకే క్లియరెన్స్ నిరాకరించినట్లు వెల్లడించారు. రేవంత్‌రెడ్డి మాత్రం ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ నిర్మాణం వంటి అంశాలను రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా చూడాలని ఆయన అన్నారు. అమెరికా పర్యటనలో జరగాల్సిన కార్యక్రమాలను తన బృందం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన లేకుండానే తెలంగాణ ప్రతినిధి బృందం అమెరికా వెళ్లి కొన్ని ప్రతిపాదిత ఒప్పందాలు, భాగస్వామ్యాలపై ముందుకు వెళ్లనుంది.
పలువురు సీఎంలకు ఇలానే..
👉గతంలో పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి కూడా విదేశీ పర్యటన విషయంలో కేంద్రం నుంచి అనుమతి రాలేదు. 2021లో రోమ్‌లో నిర్వహించిన వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌కు వెళ్లాలని ఆమె భావించారు. అయితే ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి హోదాకు తగిన స్థాయిలో లేదని పేర్కొంటూ MEA అనుమతి నిరాకరించింది. దీంతో టీఎంసీ తీవ్రంగా స్పందించింది. అంతకుముందు చికాగో పర్యటన విషయంలోనూ మమతకు అనుమతి రాలేదని నివేదికలు ఉన్నాయి.
👉ఇక ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. 2019లో డెన్మార్క్‌లో జరిగే C40 క్లైమేట్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఆయన అనుమతి కోరగా.. ఆ కార్యక్రమం నగర మేయర్ల కోసం ఉద్దేశించినదని, సీఎం స్థాయికి సరిపోదని MEA అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2022లో సింగపూర్ పర్యటనకు కూడా ఆయనకు అనుమతి లభించలేదు.
👉పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విషయంలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2026 ఫిబ్రవరిలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి సహా ప్రతినిధి బృందంతో యూకే, ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లాలని ఆయన భావించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆ పర్యటనను రూపొందించినప్పటికీ MEA రాజకీయ క్లియరెన్స్ నిరాకరించింది. 2024లో పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లి భారత హాకీ జట్టును ప్రోత్సహించాలన్న మాన్ ప్రయత్నానికీ అనుమతి రాలేదు. అయితే 2025లో జపాన్, దక్షిణ కొరియా పర్యటనకు మాత్రం ఆయనకు అనుమతి లభించింది.
👉కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2025లో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్ పర్యటనకు ఆయనకు రాజకీయ క్లియరెన్స్ రాలేదు. అంతకుముందు 2023లో సౌదీ అరేబియాలో జరగాల్సిన కార్యక్రమానికి కూడా అనుమతి సమస్య తలెత్తింది.
👉ఇది కేవలం ఇటీవలి కాలానికి సంబంధించిన వ్యవహారం కూడా కాదు. యూపీఏ హయాంలోనూ అప్పటి అసోం సీఎం తరుణ్ గొగోయ్ అమెరికా పర్యటనకు, జార్ఖండ్ సీఎం అర్జున్ ముండా థాయ్‌లాండ్ పర్యటనకు రాజకీయ క్లియరెన్స్ నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి.
అసలు పొలిటికల్ క్లియరెన్స్ అంటే?
ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారికంగా విదేశాలకు వెళ్లేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. విదేశాంగ శాఖ పర్యటన ఉద్దేశం, కార్యక్రమాల స్వభావం, వెళ్లే దేశం, సంబంధిత అంశాలు తదితరాలను పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాజకీయ క్లియరెన్స్ ఇస్తుంది. ఈ అనుమతి లేకుండా అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లడం సాధ్యం కాదు. అయితే రేవంత్ విషయంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. బ్రిటన్‌కు అనుమతి ఇచ్చి, అమెరికాకు మాత్రం ఎందుకు నిరాకరించారు? అన్నదే. దీనిపై MEA స్పష్టంగా చెప్పిన కారణం మాత్రం అమెరికా పర్యటనలోని ప్రతిపాదిత కార్యక్రమం సీఎం హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగినది కాదన్నదే. రేవంత్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం చేపట్టిన కార్యక్రమంగా చెబుతోంది. కేంద్రం మాత్రం అనుమతి విషయంలో ప్రోటోకాల్, రాజకీయ క్లియరెన్స్ నిబంధనలనే ముందుకు తెస్తోంది.
ఇదిలా ఉండగా.. రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఈ పర్యటన కోసం కోర్టు నుంచి కూడా అనుమతి పొందారు. క్యాష్-ఫర్-ఓట్ కేసులో విదేశీ పర్యటనకు సంబంధించిన షరతులను ఏసీబీ కోర్టు సడలించింది. అయితే ఆ అనుమతి కేంద్రం నుంచి అవసరమైన రాజకీయ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం రేవంత్ అమెరికా టూర్ రద్దు అంశంగా మాత్రమే కాకుండా.. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారిక విదేశీ పర్యటనల విషయంలో ఉన్న వ్యవస్థపై కూడా చర్చకు దారితీసింది.


