ఏదుల నుంచా ? శ్రీశైలం నుంచా?
ఏదుల నుంచే సరఫరాకి మంత్రి ఉత్తమ్ పట్టు
శ్రీశైలం నుంచి తీసుకోవాలని సీఎంపై పాలమూరు నేతల ఒత్తిడి
ఉత్తమ్‌తో సీఎం రేవంత్ సుదీర్ఘ సమీక్ష.. వివరాలు వెల్లడించని సీఎంఓ
సాక్షి, హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుంచి నీళ్లు తరలించాలనే అంశంపై రాష్ట్ర సర్కారులో తీవ్ర అనిశ్చితి నెలకొంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని తరలించడానికి అనుమతిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖ జీఓ 10 జారీ చేసింది. ఏదుల రిజర్వాయర్‌లో 436 మీటర్ల నీటిమట్టం నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించడానికి పనులు చేపట్టాలని అప్పట్లో సూచించింది. అయితే దీనిపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది.
డిండికి ఏదుల నుంచి కాకుండా నేరుగా శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను తరలించాలని సీఎంపై నేతలు ఒత్తిడి తెచ్చారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపగా ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినట్లు చర్చ జరుగుతోంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఈ అంశంపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించలేదు.
ఆది నుంచి వివాదం..
ఏదుల రిజర్వాయర్‌లో కనీసం 437.375 మీటర్ల నీటి మట్టం ఉంటేనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా వీరాంజనేయ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించాలని ఆ తర్వాత నిర్ణయించారు. ఏదుల జలాశయ గరిష్ట నీటినిల్వ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 445 మీటర్లు కాగా, గరిష్ట నిల్వ సామర్థ్యం 6.59 టీఎంసీలు. జలాశయంలో 440 మీటర్ల మట్టంతో 4.16 టీఎంసీలు, 437 మీటర్ల మట్టంతో 3.04 టీఎంసీలు, 436 మీటర్ల మట్టంతో 2.72 టీఎంసీల నిల్వలు ఉంటాయి.
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడానికి నిర్మిస్తున్న కాల్వ అడుగు (బెడ్ లెవల్) 21.643 కి.మీ.ల వద్ద 421.45 మీటర్ల మట్టాన్ని కలిగి ఉండగా, తొలి ప్రతిపాదనల ప్రకారం ఏదులలో 436.41 మీటర్ల మట్టం నుంచి నీటిని తరలించాల్సి ఉంది. డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్‌లో ఉండాల్సిన నీటిమట్టం, డిండి ప్రాజెక్టు కాల్వ లోతు మధ్య 4.9 మీటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్‌లో ఉండాల్సిన కనీస నిల్వ మట్టాన్ని 440 మీటర్లకు పెంచాలని గతంలో ఈఎన్సీ (జనరల్) నేతృత్వంలోని ఓ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఏదుల రిజర్వాయర్‌ను 440 మీటర్లకు నింపడానికి కేవలం 2 రోజులే పడుతుందని, దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఏదులలో 440 మీటర్ల స్థాయిలో నిల్వలున్నప్పుడే డిండి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని సూచించింది. అప్పట్లో దీనిని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో అనుమతించిన విధంగా 436 మీటర్ల నీటి మట్టం నుంచే నీళ్లను తరలించడానికి కట్టుబడాలని అప్పట్లో డిమాండ్ చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ నేతల వ్యతిరేకత నేపథ్యంలో..
శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తం 90 టీఎంసీలను తరలించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తుండగా, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున మొత్తం 30 టీఎంసీలను తరలించుకోవడానికి డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజా ప్రతినిధుల నుంచి వ్యతిరేకత రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు డిండి ప్రాజెక్టు సోర్స్‌ను శ్రీశైలంకు మార్చే అంశాన్ని నీటిపారుదల శాఖ పరిశీలించగా ఆ శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. దీనితో ఈ అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ .. మంత్రి ఉత్తమ్ తో సమావేశమైనట్టు తెలిసింది. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌కర్నూల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని 21 మండలాల పరిధిలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు.


