తెలంగాణ రాజకీయాలు మళ్లీ సెంటిమెంట్ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తనకు ఏపీ సీఎం చంద్రబాబుతో సన్నిహిత సంబందాన్ని ఏనాడో తెంచుకున్నానని చెప్పడం కాని, తెలంగాణ బిడ్డను, నీళ్లలో అన్యాయం చేస్తానా అని అనడం కాని.. ఇలాంటివి ఈ కోవలోకి వస్తాయి. రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేసిన కొన్ని ప్రసంగాలు, వ్యాఖ్యలను గమనిస్తే, తెలంగాణలో తన పట్టు నిలబెట్టుకోవడానికి ఆయన బాగా కష్టపడుతున్నారనిపిస్తుంది. ఆక్రమంలో ఒక్కోసారి బ్యాలెన్స్ కోల్పోతున్నారన్న భావన కలుగుతుంది. ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కేడీ అని అనడం పద్దతిగా లేదని చెప్పాలి.
తాను తెలంగాణ బిడ్డను అని, నీళ్లలో అన్యాయం చేస్తానా అని ఒక సభలో ప్రశ్నించారు. ఇదే సందర్భంలో చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు లేవని చెప్పడానికి యత్నించారు. సన్నిహిత సంబంధాలు లేవని అన్నారే కాని, అసలు సంబంధాలు లేవని ఆయన చెప్పినట్లు కనిపించదు. నిజానికి వ్యక్తిగత సంబంధాలు ఉండడం ఆక్షేపణీయం కాదు. కాని రాజకీయ సంబంధాలు ఉంటేనే సమస్య. ఎంత సన్నిహితుడు కాకపోతే రాయలసీమకు విశేషంగా ఉపయోగపడే లిఫ్ట్ ప్రాజెక్టును రేవంత్ చెప్పగానే చంద్రబాబు నిలిపివేస్తారన్న ప్రశ్న వస్తుంది.
రేవంత్‌కు బాబు పరోక్ష సాయం
సంబంధాల అంశంలో రేవంత్ చెప్పిన మాటలను రాజకీయవర్గాలు కాని, ఇతర సాధారణ ప్రజానీకం కాని పెద్దగా నమ్మడం లేదు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్‌ల మధ్య గత పదిహేనేళ్లుగా బలమైన బంధం ఏర్పడింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లివచ్చిన తర్వాత ఆ బంధం మరింత గట్టిపడిందని రాజకీయవర్గాలు చెబుతుంటాయి. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లే ముందు చంద్రబాబు అనుమతి తీసుకున్నారు. తదుపరి కాంగ్రెస్ అధిష్టానం వద్ద చంద్రబాబు పలుకుబడిని ఉపయోగించి రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కాగలిగారని చాలామంది నమ్ముతారు. ముఖ్యమంత్రి అవడంలో కూడా చంద్రబాబు పరోక్షంగా సాయపడ్డారన్న అభిప్రాయం ఉంది.
చంద్రబాబు, రేవంత్‌ల స్కెచ్
చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో కూడా సంబంధాలు ఉన్నాయన్నది పలువురి భావన. దానికి ఆధారాలు ఉన్నాయా అంటే నేరుగా కనిపించవు. కాని చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించేవారు. అలాంటిది ఇటీవలి కాలంలో ఆ పార్టీ జోలికే వెళ్లడం లేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మీద మాత్రమే పరుషంగా మాట్లాడుతుంటారు. షర్మిల ఏపీసీసీ ఛీప్ అవ్వడం, ఆమె కూటమి ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయకుండా ఉండడం, వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు సాగించడం మొదలైన అంశాల కారణంగా ముఖ్యమంత్రితో రాజకీయ సంబంధాలు నెరుపుతున్నారన్న అభిప్రాయం నెలకొంది. చంద్రబాబు రాజకీయ డైరెక్షన్‌లోనే ఆమె పనిచేస్తున్నారన్న భావన కాంగ్రెస్ నేతలు పలువురిలో ఉంది. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న షర్మిల కొన్నాళ్లకు మూసివేసి, కాంగ్రెస్‌లోకి వచ్చి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అవడంలో చంద్రబాబు, రేవంత్‌ల స్కెచ్ ఉండవచ్చన్నది చాలా మంది విశ్లేషణగా ఉంది. బహుశా రాహుల్ గాంధీతో కూడా చంద్రబాబు సంబంధాలు పెట్టుకోబట్టే ఇలా సాధ్యమవుతోందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తుంటారు.
ఇదీ చదవండి: బెడిసికొట్టిన ప్లాన్.. ధర్నా డ్రామా తుస్!
చంద్రబాబు కోసమే పనిచేసే ఎల్లో మీడియాగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమానితో రేవంత్ సంబంధాలు అందరికి తెలిసిందే. ఈ మధ్య కూడా ఆయన ఈ మీడియా కొత్త కార్యాలయాన్ని సందర్శించి వచ్చారు. ఇది కూడా టీడీపీ వారితో రేవంత్ కు కొనసాగుతున్న అనుబంధాన్ని తెలియచేస్తుంది. ఈ విషయాన్ని పక్కనబెడితే ఏపీ ప్రభుత్వం జలజీవవన్ మిషన్ కింద బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. దీనిని సెంటిమెంట్‌గా మార్చే యత్నాలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ విమర్శలకు సమాధానం ఇస్తూ తెలంగాణ నీటిని చుక్క కూడా వదలుకోబోమని, ఈ స్కీమ్ కేసీఆర్ టైంలోనే ఏపీ ఆరంభించిందని, ఆయన దానిని అడ్డుకోలేదని రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు చెబుతున్నారు. ఈ స్కీమ్‌పై కృష్ణా వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. రేవంత్ ఇప్పుడు ఈ స్కీమ్‌ను ఆపు చేయిస్తే చంద్రబాబుతో ఉన్న బంధం మరోసారి రూడీ అవుతుంది. అలా చేయలేకపోతే తెలంగాణలో రాజకీయంగా ఇబ్బంది పడవచ్చు. ఒకవేళ పల్నాడు స్కీమ్‌ను రేవంత్ కోరారు కదా అని నిలిపివేస్తే, ఏపీలో చంద్రబాబుకు అది మైనస్ కావచ్చు. ఇది వీరిద్దరికి ఒక పరీక్ష వంటిదని చెప్పాలి.
రేవంత్ సర్కార్‌కు బాబు సలహా!
కాగా కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంట్రాక్టుల విషయంలో కాని, రేవంత్ భాష గురించి కాని పలు విమర్శలు చేస్తున్నారు. రాజగోపాలరెడ్డి కాంట్రాక్టర్ కనుక విమర్శలు చేస్తున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నా, ఆయన చెబుతున్న మాటలు సీరియస్‌గానే ఉన్నాయి. ఆంధ్రా కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని రాజగోపాలరెడ్డి ఆరోపించడం ద్వారా సెంటిమెంట్ ప్రేరేపించడానికి యత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణకు చెందిన కొందరు కాంట్రాక్టర్లలో కూడా ఇదే అభిప్రాయం ఉంది. చంద్రబాబు హైదరాబాద్ వచ్చినపప్పుడల్లా తెలంగాణలోని కాంట్రాక్టులను ఎవరెవరికి ఇవ్వాలో రేవంత్ సర్కార్‌కు సలహా ఇస్తుంటారన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజం ఉందో తెలియదు కాని ఈ రకమైన అభిప్రాయం ప్రబలితే అది రేవంత్‌కు నష్టం చేస్తుంది.
భాష విషయంలో జాగ్రత్త
భాష విషయంలో రేవంత్ కొన్నిసార్లు తీవ్రంగానే మాట్లాడడం వల్ల రాజకీయంగా లాభమా, నష్టమా అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. కాంగ్రెస్‌లో అసమ్మతిని వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి మా వాళ్లు కొందరికి పిచ్చి కుక్క కరిసినట్లు ఉందని అనడం, పండబట్టి తొక్కుతా అని కొందరిని హెచ్చరించడం వంటి భాష సబబు అనిపించదు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఘట్టంతో సహా ఆయా జిల్లాలలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గొడవలు జరుగుతుండడం పార్టీకి నష్టం చేస్తోంది. దీనిని కంట్రోల్ చేయడం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు కష్టం అవుతోంది. ఈ మధ్య క్రమశిక్షణ కమిటీ విచారణకు పిలిస్తే మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు హాజరు కాలేదు. దాంతో మహేష్ గౌడ్ అధిష్టానానికి ఫిర్యాదు చేయవలసి వచ్చింది.
సొంత వర్గాన్ని పెంచుకుంటున్న రేవంత్
రేవంత్ తన ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చెప్పడానికి తీవ్రంగా కృషి చేస్తున్నా, పార్టీలో ఇతర నేతల మద్దతు అంతంత మాత్రంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే రేవంత్ సొంత వర్గాన్ని పెంచుకునే పనిలో ఉన్నారని అంటున్నారు. ఒకసారి బీఆర్ఎస్ భవిష్యత్తు గతం అని ఆయనే అంటారు. మరోసారి తమకు ప్రధాన ప్రత్యర్ధి బీఆర్ఎస్సే అని అంటారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. దాంతో కాంగ్రెస్ ఖేల్ ఖతం అని అనుకునేవారు. కాని 2023లో అధికారంలోకి రాగలిగింది.
బీఆర్ఎస్ నేతల ఘాటు వ్యాఖ్యలు
ఇక బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో వీరు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి యత్నిస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో చెప్పలేం కాని, ఓవరాల్‌గా కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత వీరికి కొంత ఉపయోగపడవచ్చు. కాకపోతే మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ వారే బాంబులు పెట్టి పేల్చారని కేటీఆర్ ఆరోపించడం సరికాకపోవచ్చు. ఎందుకంటే ఆ బ్యారేజీ కుంగినప్పుడు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందువల్ల ఆయన చర్య తీసుకోలేకపోయారన్న ప్రశ్న వస్తుంది. కరువు కాలంలో గోదావరి నీటిని రేవంత్ సర్కార్ ఉపయోగించుకోలేకపోయిందన్న విమర్శ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బెటర్. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీకి గులాంలు అన్న సెంటిమెంట్‌ను తీసుకురావడానికి కూడా బీఆర్ఎస్ యత్నిస్తోంది. ఏది ఏమైనా రెండేళ్లలో జరగనున్న ఎన్నికలలో విధానాల పరమైన ప్రసంగాలతో కాకుండా, సెంటిమెంట్లతోనే రాజకీయం సాగించడానికి మూడు ప్రధాన పార్టీలు యత్నించడం విశేషం.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


