సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ పట్టణాభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన సీఎం, పనుల వేగవంతంపై స్పష్టమైన గడువులను నిర్దేశించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశ (ఫేజ్-1) పనుల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉన్న 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1ఏ గా, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉన్న 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1బీ గా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.
ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని వచ్చే ఏడాది జనవరి నాటికి క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.నగరంలోని చారిత్రక మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. 2028 జనవరి నాటికి ఈ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు.కేవలం సుందరీకరణ పనులకే పరిమితం కాకుండా, చెరువులో ఎంతో కాలంగా పేరుకుపోయిన పూడికను పూర్తిస్థాయిలో తొలగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచే రేడియల్ రోడ్ల నిర్మాణం, వాటికి సంబంధించిన భూసేకరణ పురోగతిని అధికారులు సీఎంకు నివేదించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి,రోడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. అలాగే, గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనుల స్థితిగతులను సమీక్షించిన ముఖ్యమంత్రి, వచ్చే ఏడాది మార్చి నాటికి ఆ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


