నీళ్లెత్తవయ్యా రేవంత్‌ అంటే మాపై దుమ్మెత్తి పోస్తున్నారు : హరీశ్‌రావు | Harish Rao Counter To Revanth Reddy | Sakshi
Sakshi News home page

నీళ్లెత్తవయ్యా రేవంత్‌ అంటే మాపై దుమ్మెత్తి పోస్తున్నారు : హరీశ్‌రావు

Nov 24 2026 1:21 PM | Updated on Nov 24 2026 1:37 PM

Harish Rao Counter To Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: నీళ్ల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి.. కానీ అందుకు బదులుగా బురద చల్లితే ఎలా? తెలంగాణ నీటి హక్కులపై నిలదీస్తుంటే బీఆర్‌ఎస్‌పై నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. గొంతు పెంచి మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావని, ప్రజలు తప్పుడు మాటలను నమ్మరని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై బురద చల్లేందుకు రేవంత్‌రెడ్డి విఫలయత్నం చేశారని విమర్శించారు. ‘నీళ్లు ఎత్తవయ్యా రేవంత్‌ అంటే మాపై దుమ్మెత్తి పోస్తున్నారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టే అతితెలివి ప్రదర్శిస్తున్నారు. నిందలు వేసినంత మాత్రాన అవి నిజాలు కావు. నువ్వు మాట్లాడే తప్పుడు మాటలను ప్రజలు నమ్మరని, నీకంటే, నాకంటే ప్రజలు తెలివైనవారని రేవంత్‌ అర్థం చేసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తప్పన్నట్లుగా రేవంత్‌ మాటతీరు ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ బిడ్డలపై తుపాకీ గురిపెట్టడమే సరైనదన్నట్లు సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ హక్కుల గురించి రేవంత్‌రెడ్డి ఏనాడైనా మాట్లాడారా? తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాజెక్టులు, నీటి వాటాల గురించి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తెలంగాణలో వలసలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆరోపించారు.

అలాగే మెదక్‌ జిల్లాకు ఆయకట్టు వచ్చిందంటే అది కేసీఆర్‌ చేసిన పోరాటం వల్లేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. పాలమూరు జిల్లాను నాశనం చేసింది కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలేనని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో పాలమూరు ప్రాజెక్టుల కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని, ఒక్క పాలమూరు జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు నీరు అందించామని తెలిపారు. కాని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదనంగా లక్ష ఎకరాలకైనా నీరు అందించారా? అని ప్రశ్నించారు.

సొంత జిల్లా పాలమూరుకు రేవంత్‌రెడ్డి ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణను కరువుపాలు చేసిందే కాంగ్రెస్‌ అని, నీటి హక్కులపై సమాధానం చెప్పకుండా బీఆర్‌ఎస్‌పై నిందలు వేయడం సరికాదని, కాంగ్రెస్‌ నేతలు కట్టు బానిసలుగా వ్యవహరిస్తున్నారని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: మెట్రో రుణమా? నాకేమీ తెలీదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement