సాక్షి, వైఎస్సార్ జిల్లా: వేంపల్లిలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్‌కు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
పోలీసులు, రౌడీలు, అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్తున్న ఓటర్లను అడ్డుకుంటున్నారు. కూటమి నాయకుల అరాచకాలను మౌనంగా చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండవన్నారు. అవినీతి పోలీసులు, అధికారుల వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరాచక శక్తులను ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చిన సతీష్ రెడ్డి.. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి అరాచక శక్తులుగా మారారని సతీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్‌కు మరోసారి కష్టమే


