మున్సిపల్ కౌంటింగ్ హాల్ వద్ద వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డితో వాగ్వాదానికి దిగిన డీఎస్పీ రవిబాబు (ఫైల్)
శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం డీఎస్పీ రవిబాబు వ్యవహార శైలి రోజు రోజుకూ వివాదాస్పదమవుతోంది. సామాన్య ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలను చూస్తే చాలు బూతులతో రెచ్చిపోతున్నారు. ఉద్దేశ పూర్వకంగానే అసభ్యకర పదజాలాన్ని వినియోగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారన్న విమర్శలున్నాయి.
అధికార పార్టీకి దాసోహం
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు సహరించిన డీఎస్పీ రవిబాబు... గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం అదే తరహా అధికార పార్టీ నేతలకు సహకరించేలా వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వైఎస్సార్‌సీపీ కండువా కనిపిస్తే చాలు తన ప్రతాపాన్ని చూపెడుతూ బూతులతో రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను రెచ్చగొట్టడం, వారు ప్రశ్నిస్తే గలీజు మాటలు మాట్లాడి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద తనిఖీల పేరుతో నాయకులను ఇబ్బంది పెట్టడంతో పాటు స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేయడం పరిపాటిగా మారింది. ఆయన పోలీసులా కాకుండా అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారన్న చర్చ సర్వత్రా సాగుతోంది.
ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టిలో పడేందుకే..
పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ను మించిన ఓవర్ యాక్షన్ చేస్తున్న డీఎస్పీ రవిబాబు.. ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టిలో పడేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులను చూస్తే చాలు శివాలెత్తిపోతున్నారు. విద్యావంతులను, అమాయకులను లక్ష్యం చేసుకొని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది సైతం ఆయన వస్తున్నాడంటే చాలు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన టీడీపీ నాయకులు తప్ప మరెవరూ మనుషులు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని, కేవలం బాలకృష్ణ దృష్టిని ఆకర్షించేందుకు ఆపసోపాలు పడుతున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యే పీఏలకు ఏజెంట్‌లా వ్యవహరిసున్న డీఎస్పీ సామాన్యులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారంటున్నారు. ఎన్నికల్లో ఈసీ కీలకం కాగా ... హిందూపురం నియోజకవర్గంలో మాత్రం డీఎస్పీ రవిబాబే ఈసీలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
మాట ధిక్కరిస్తే కేసులు
పోలింగ్ , కౌంటింగ్ ఒకేరోజు జరనుండటంతో డీఎస్పీ వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకున్నారు. ఓటు వేశామా? స్టేషన్‌కు వచ్చామా అన్నట్లు ఉండాలని, తన మాట దిక్కరిస్తే బైండోవర్ ఉల్లంఘనల కింద కేసులు పెడతానని హెచ్చరిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అందరినీ స్టేషన్‌లకు పిలవడం, కేసులు పెట్టి వేధించడం, ఏఓ పత్రాలివ్వడం సంతకాలు పెట్టించుకోవడం వంటివి చేస్తూ ఆ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఆయన చర్యలపై నిఘా పెట్టాలని, వేధింపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆయన ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉన్నందుకు డీఎస్పీని ఎన్నికల విధుల నుండి తప్పించాలన్న డిమాండ్ విపిస్తోంది.
ఇదీ చదవండి: సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్


