పిఠాపురం: స్థానిక నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మరోసారి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ గెలుపు కూడా కష్టమేనని జనసేన ఎంపీపీ అభ్యర్థిని, విరవాడ ఎంపీటీసీ–1 రామిశెట్టి గంగా పార్వతి అన్నారు. పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపికలో వర్తించిన పార్టీ విప్ నిబంధన ఎంపీపీ ఎన్నికల్లో తమకు ఎందుకు అమలు కాలేదని ఆమె ప్రశ్నించారు. విరవాడ జనసేన నాయకులు రామిశెట్టి సూరిబాబు, కందా ఏడుకొండలు తదితరులతో కలసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం ఎంపీపీ ఎన్నికలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి జనసేన తరఫున ఎంపీటీసీ–1గా గెలుపొందిన రామిశెట్టి గంగా పార్వతిని పిఠాపురం ఎంపీపీ అభ్యరి్థగా పార్టీ అధిష్టానం బీఫారం ఇచ్చిందని తెలిపారు. ఎంపీ ఉదయ శ్రీనివాస్, పెండెం దొరబాబు వారి అనుచరులు జోక్యం చేసుకుని పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి తమను ఓడించారని వాపోయారు. ఎంపీపీ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునే విధంగా నిర్ణయించారని, అయితే ఈ విషయాన్ని కనీసం అభ్యర్థితో ఇప్పటికీ చర్చించలేదన్నారు.
ఎంపీపీ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో కొందరు జోక్యం చేసుకుని పార్టీ అధిష్టానం సూచించిన అభ్యర్థిని ఓటమికి పనిచేశారని అన్నారు. ఎంపీపీ ఎన్నిక జరిగిన సమయంలో కొంతమంది అనధికార శక్తులు లోపలికి ప్రవేశించి డబ్బుతో రాజకీయం చేసి పార్టీ బీఫారం ఇచ్చిన తమను ఓడించారని అన్నారు. కొత్తపల్లి మండలంలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేశారని, విరవాడకు సంబంధించిన ఎంపీపీ ఎన్నికలోనూ అలాంటి అవకాశం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. పార్టీ పట్ల విధేయతతో ఇంతకాలం వేచి చూశామని, తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదన్నారు.
ఆ నిబంధన మాకు వర్తించదా?
పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపికలో అమలైన విప్ నిబంధన తమకు వర్తించదా అని గంగా పార్వతి ప్రశ్నించారు. కేవలం ఐదుగురు మాత్రమే మద్దతు తెలిపిన వ్యక్తికి పార్టీ ఆదేశించి బీఫారం ఇచ్చిందని, విప్ ధిక్కరించరాదని మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ చెప్పారని, మరి అదే పార్టీ అదే బీఫారం తమకు కూడా ఇచ్చిందని, ఆ నిబంధన తమకు ఎందుకు వర్తింపజేయలేదని ప్రశ్నించారు. జనసేన అధికారం చేపట్టిన తర్వాత కొంతమంది పార్టీలో చేరి సర్వనాశనం చేశారని విమర్శించారు. ఎంపీ అనుచరుడు చక్రి వంటి కొంతమంది నాయకులు ప్రతి పదవిని డబ్బులకు అమ్ముకొని సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని, పిఠాపురం ఎంపీపీ ఎన్నిక విషయంలోనూ అదే జరిగిందని చెప్పారు.
ఎవరినైనా ఒక్కసారే చూస్తారు..
పిఠాపురం ప్రజలు ఎవరినైనా ఒక్కసారే చూస్తారని, పిఠాపురం జనసేన పార్టీలో కొంతమంది నాయకులు చేరి పార్టీని భ్రష్టు పట్టించారని గంగా పార్వతి అన్నారు. పవన్‌కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేసే సమయంలో ఎంతోమంది యువత, నాయకులు, వీర మహిళలు కష్టపడి పనిచేసి గెలిపించారని, పార్టీ అధికారంలోకి వచ్చాక కొంతమంది నాయకులు చేరి పార్టీని, పనిచేసిన నాయకులను సర్వనాశం చేశారని చెప్పారు. ఇదే పరిస్థితి చివరి వరకు కొనసాగితే రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు కష్టమేనని అన్నారు. ఈ మాఫియాను అరికట్టేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పార్టీ మనుగడ ఉండదన్నారు.
ఇదీ చదవండి: ఇంకా క్షోభ పెడతారా..?


