విపత్తుల వేళ వెట్టిచాకిరీ.. సంక్షేమంలో కిరికిరి | Electricity employees anger towards the Chandrababu government | Sakshi
Sakshi News home page

విపత్తుల వేళ వెట్టిచాకిరీ.. సంక్షేమంలో కిరికిరి

Nov 25 2026 5:52 AM | Updated on Nov 25 2026 5:52 AM

Electricity employees anger towards the Chandrababu government

చంద్రబాబు సర్కారుపై విద్యుత్‌ ఉద్యోగుల ఆగ్రహం

వాస్తవంలో ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు 

విద్యుత్‌ ఉద్యోగుల పెన్షన్‌ భరోసా విషయంలో పక్షపాత ధోరణి 

ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్పునకు లేనిపోని లింకులు 

60 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం 

ఇప్పుడు ఉద్యోగుల వాటా, యాజమాన్య వాటా కలిపినా సరిపోని నిధులు 

హైకోర్టు ఆదేశాలు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులకూ దక్కని ప్రాధాన్యం 

చంద్రబాబు ప్రభుత్వ పక్షపాత వైఖరిపై రగిలిపోతున్న విద్యుత్‌ ఉద్యోగులు

సాక్షి, అమరావతి: విద్యుత్‌ ఉద్యోగుల పెన్షన్‌ సమస్య పరిష్కారం కాకపోగా.. రోజురోజుకూ మరింత జఠిలంగా మారుతోంది. ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్పు, పాత పెన్షన్‌ విధానం అమలు వంటి కీలక అంశాలపై యాజమాన్యాలు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చడం లేదు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి 60 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఒక్క ముందడుగు కనిపించడం లేదు. మరోవైపు జీపీఎఫ్‌కు మారాలంటే ఒక్కో ఉద్యోగి రూ.లక్షల్లో  అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

60 రోజుల హామీ ఏమైంది
2025 అక్టోబర్‌లో విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీతో జరిగిన చర్చల్లో ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్పునకు సంబంధించిన ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఆర్థిక అంశాల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు పాత పెన్షన్‌ విధానం అమలుపైనా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని అంగీకరించింది. అయితే ఆ హామీల అమలు పరిస్థితిపై ఇప్పటికీ స్పష్టత లేదని ఉద్యోగులు చెబుతున్నారు. చర్చల్లో అంగీకరించిన అంశాలను అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. 

మరోవైపు తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్‌లోకి మారేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ విద్యుత్‌ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్పు ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. ఉదాహరణకు ఉద్యోగి వాటా, యాజమాన్య వాటా కలిపి సగటున రూ.40 లక్షల వరకు సమకూరుతున్నా.. జీపీఎఫ్‌కు మారేందుకు సుమారు రూ.50 లక్షలు అవసరమవుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ఒక్కొక్కరిపై దాదాపు రూ.10 లక్షల అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు. పెన్షన్‌ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం తమకు కొత్త ఆర్థిక సమస్యను తెచ్చిపెడుతోందని వారు  ఆందోళన చెందుతున్నారు. 

హైకోర్టు ఆదేశాలున్నా
పెన్షన్‌ సమస్యపై ఉద్యోగులు న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. 2025 జనవరిలో 2002లో నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ ప్రయోజనాలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. సంబంధిత నిబంధనల ప్రకారం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 2025 అక్టోబర్‌ 17న వెలువడిన మరో ఉత్తర్వులో 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 సెపె్టంబర్‌ 1 మధ్య చేరిన ఉద్యోగుల ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్పు ప్రతిపాదనను ఆర్థిక భారం కారణంగా ప్రభుత్వం తిరస్కరించిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేసుకునే అవకాశం కూడా ఉద్యోగులకు ఉందని పేర్కొంది. అయినా ఈ సమస్యకు ఇప్పటి వరకూ పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని ఉద్యోగులు అంటున్నారు. 

పెన్షన్‌లోనూ వివక్షేనా
1999 ఫిబ్రవరి 1కి ముందు నోటిఫికేషన్లు జారీ చేసి, ఆ తర్వాత నియామకాలు చేపట్టిన ఉద్యోగుల విషయంలో వేర్వేరు నిబంధనలు అమలు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులైన వారికే పాత పెన్షన్‌ విధానంలోకి మారే అవకాశం కల్పిస్తూ.. కాంట్రాక్టు, క్యాజువల్, కారుణ్య నియామకాల ఉద్యోగులకు అదనపు చెల్లింపుల షరతులు విధిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. వీరికి కూడా నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు జరిగినప్పుడు పెన్షన్‌ విషయంలో భిన్నమైన ప్రమాణాలు ఎందుకని నిలదీస్తున్నారు. అందరికీ సమాన న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

ఒక్కో సంస్థలో ఒక్కో విధానం
ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల పరిధిలో పనిచేసే ఉద్యోగుల సమస్యలపై ఏకరూప నిర్ణయాలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక సంస్థలో ఒక విధంగా ఉత్తర్వులు జారీ చేస్తే.. మరో సంస్థలో భిన్నమైన విధానం అమలు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒకే విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య అసమానతలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. అన్ని సంస్థల్లో ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. 

ప్రశంసలు కాదు.. పరిష్కారం కావాలి
ఇటీవల వరుస తుఫాన్ల సమయంలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు ఉద్యోగులను రేయింబవళ్లు పనిచేయించుకుంది ప్రభుత్వం. వీరి కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రశంసించారు. కానీ వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు.  ఇచ్చిన హామీల అమలు పురోగతిపై స్పష్టత ఇవ్వాలని, పెన్షన్‌ మార్పులో అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్‌ నిబంధనలు వర్తింపజేసి  ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విద్యుత్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement