సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో బుధవారం నుంచి 4 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం, అల్లూరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురు తేలికపాటి వర్షాలు పడొచ్చని వెల్లడించింది. కాగా, మంగళవారం నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 3.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొత్తపట్నం 3.4, కావలి 3.4, మారెళ్ల 3.3, త్రిపురాంతకం 2.7, నెల్లూరు 2.7, ములుకుదురు 2.6, నెల్లూరు రూరల్ 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


