భోగాపురం వద్ద ఘోర ప్రమాదం | Horrific accident near Bhogapuram | Sakshi
Sakshi News home page

భోగాపురం వద్ద ఘోర ప్రమాదం

Nov 25 2026 4:59 AM | Updated on Nov 25 2026 4:59 AM

Horrific accident near Bhogapuram

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి 

ఆగివున్న లారీ ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొన్న కారు

మృతులు విశాఖ జిల్లా మధురవాడ, తగరపువలస, భీమిలి వాసులు

పూసపాటిరేగ: విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట సమీపంలోని ఎన్‌హెచ్‌–16పై మంగళవారం ఉదయం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా మధురవాడకు చెందిన వాకచర్ల శ్రీనివాసరావు (45), ఆయన భార్య కుసుమ రంజిని (40), భీమిలికి చెందిన బొర్రా సతీష్‌ (47), ఆయన భార్య బొర్రా శృతి (40), కొండపు సూరిబాబు (49) కారులో సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మధురవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వరస్వామి దర్శనానికి బయలుదేరారు. 

దైవదర్శనం అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా భోగాపురం సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ఉదయం 7.30 గంటల సమయంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీ ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా.. అందులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు, కుసుమ రంజిని, సతీష్, శృతి అక్కడకక్కడే మృతి చెందారు. సూరిబాబుకు తీవ్ర గాయాలు కావడంతో సంగివలస ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్సపొందుతూ నిమిషాల వ్యవధిలోనే మృతి చెందారు.

శ్రీనివాసరావు, సతీష్, సూరిబాబు స్నేహితులు. విశాఖపట్నంలోని రిలయన్స్‌ డిజిటల్‌లో ఉద్యోగులు. దైవదర్శనం అనంతరం విధులకు హాజరు కావాలనుకున్నారు. రోడ్డు ప్రమాదం వీరిని మృత్యు ఒడికి చేర్చిందంటూ కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఘటనా స్థలాన్ని విజయనగరం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుల బ్యాగుల్లో 1.97 లక్షల నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భోగాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement