ఆత్మకూరు వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక జరిగినా.. జరగలేదని నివేదిక
వైస్ చైర్‌పర్సన్‌తో ప్రమాణస్వీకారం చేయించిన తర్వాత కూడా బుకాయింపు
కూటమిలో విభేదాలతో.. జరిగిన ఎన్నిక జరగలేదన్న అధికార యంత్రాంగం.. అధికారులు, ఎస్‌ఈసీపై ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వ పెద్దలు
ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికల నిర్వహణ
ఈ ఎన్నికల చెల్లుబాటుపై సర్వత్రా చర్చ
ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో నిబంధనల మార్పు.. ఎస్‌ఈసీది ప్రేక్షకపాత్రే.. ప్రభుత్వ కనుసన్నల్లోనే స్థానిక ఎన్నికలు
సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి నెల్లూరు: ఎన్నిక పూర్తయి, ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించిన తరువాత కూడా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అధికారులు అసలు ఎన్నికే జరగలేదని మళ్లీ నిర్వహించిన వైనం ఇది. పాలక కూటమిలో విభేదాల నేపథ్యంలో పెద్దల ఒత్తిడికి అధికారులు తలవంచక తప్పలేదని సమాచారం. ఎన్నికల వ్యవస్థ, నిబంధనలు ఇవేమీ పట్టించుకోకుండా పాలకులు ఇష్టారీతిని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారనడానికి ఇది మరో ఉదాహరణ.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ప్రేక్షకపాత్రకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక సోమవారం నిర్వహించారు. చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన బొమ్మిరెడ్డి షకీల, వైస్ చైర్‌పర్సన్‌గా జనసేనకు చెందిన కత్తి పద్మజ ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి ఆర్డీవో వారిద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. వీరికి శుభాకాంక్షలు చెబుతూ మధ్యాహ్నం రెండుగంటలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు కూడా చేశారు.

ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సోమవారం మంత్రి ఆనంను నిలదీస్తున్న జనసేన కౌన్సిలర్ కె.శిరీష
టీడీపీ, జనసేన మధ్య తీవ్ర విభేదాలు
ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పదవికి తమ అభ్యర్థిగా శిరీష పేరును ప్రకటించిన జనసేన ఆమెకు బీఫారం కూడా ఇచ్చింది. అయితే మంత్రి రామనారాయణరెడ్డి.. జనసేనకు చెందిన కత్తి పద్మజతో నామినేషన్ వేయించి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక చేయించారు. ఈ విషయమై రెండుపార్టీల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది. తమపార్టీ ఇచ్చిన బీఫారాన్ని కూడా తారుమారు చేశారని జనసేన నేతలు ఆరోపించారు. ఎన్నిక సమయంలోనే ఆందోళనకు దిగిన జనసేన నేతలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. వ్యవహారం పార్టీ అధిష్టానాల వద్దకు చేరింది.
తమ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించిన పేరునే తెలుగుదేశం మంత్రి మార్చేయడంపై జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. ఇది మరింత ముదురుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. అప్పటికే ఎన్నిక జరిగినందున మళ్లీ ఎన్నిక జరగాలంటే గెలిచినవారు రాజీనామా చేయాలి. తరువాత మళ్లీ ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నిక నిర్వహించాలి. దీనికి సమయం పడుతుంది. అందుకని ప్రభుత్వ పెద్దలు.. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్‌ఈసీపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక జరగలేదని ఎస్‌ఈసీకి నివేదిక ఇప్పించారు. తొలిరోజు ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు ఎన్నిక నిర్వహించవచ్చన్న నిబంధన మేరకు మంగళవారం మళ్లీ ఎన్నిక నిర్వహించారు. జనసేన ముందు ప్రకటించిన శిరీషను వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుని ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు.. తరువాత అసలు ఎన్నికే జరగలేదని చెప్పి మళ్లీ నిర్వహించిన ఎన్నిక చెల్లుతుందా లేదా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల చట్టబద్ధత ప్రశ్నార్థకమే!
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న మండలాల్లో కో–ఆప్షన్ సభ్యులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, 20న జెడ్పీల్లో కో–ఆప్షన్ సభ్యులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ముందు కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలని నిర్దేశించింది. ఈ ఎన్నికల నిబంధనలను మారుస్తూ.. కో–ఆప్షన్ సభ్యులను ముందుకాకుండా తరువాత ఎన్నుకోవాలని 19వ తేదీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపీపీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకే ఎన్నికలు నిర్వహించేశారు. ఈ ఎన్నికల చట్టబద్ధతపైనా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


