నెల్లూరు(క్రైమ్): జిల్లాను పొగమంచు కమ్మేస్తోంది. తెల్లవారుజామున నుంచి ఉదయం 8 గంటల వరకు రహదారులపై మంచు దుప్పట్లు పరుచుకుంటున్నాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు విశాలమైన రహదారులపై వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. కంటిచూపు తగ్గిన సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు వేగాన్ని నియంత్రించుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రమాదాలకు కారణాలివే..
సాధారణ వాతావరణంలో డ్రైవింగ్ చేయడానికి, పొగమంచు కమ్ముకున్న సమయంలో ప్రయాణించడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. దట్టమైన మంచు కారణంగా రహదారి స్పష్టంగా కనిపించకపోవడం, ఎదురుగా వచ్చే వాహనాలను సకాలంలో గుర్తించలేకపోవడం, రోడ్డుపక్కన నిలిపిన వాహనాలు కనిపించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కంటిచూపు తగ్గినప్పటికీ అధిక వేగంతో ప్రయాణించడం, ముందున్న వాహనాలను అధిగమించేందుకు ప్రయత్నించడం, మలుపుల వద్ద అప్రమత్తత లేకపోవడం ప్రమాదాల తీవ్రతను పెంచుతున్నాయి. మంచు కారణంగా వాహనాల మధ్య దూరాన్ని అంచనా వేయడం కష్టమవుతుంది. దీంతో అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు వెనుక వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది.
ఏం చేయాలంటే..
వాహనదారులు ప్రయాణానికి ముందే తమ వాహనాల పరిస్థితిని పరిశీలించుకోవాలి. ముఖ్యంగా వైపర్లు, హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, బ్రేకులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలి. వాహనాల అద్దాలపై మంచు, తేమ పేరుకుపోకుండా శుభ్రం చేసుకోవాలి. కార్లలో డీఫాగర్ వ్యవస్థను వినియోగించాలి. పొగమంచు తీవ్రంగా ఉన్నప్పుడు లోబీమ్ హెడ్‌లైట్లు, ఫాగ్‌లైట్లు ఉపయోగించాలి. హైబీమ్ లైట్ల వల్ల ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లకు కాంతి తగిలి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వీలైనంత వరకు అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వేగాన్ని తగ్గించి, రహదారిపై కనిపించే దూరాన్ని బట్టి నెమ్మదిగా ప్రయాణించాలి. ముందున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నం చేయకుండా తగినంత దూరం పాటించాలి. మలుపులు, వంతెనలు, రహదారి కూడళ్ల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలి.
రోడ్డుపై పార్కింగ్ వద్దు
పొగమంచు సమయంలో రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేయడం ప్రమాదకరం. వెనుక వచ్చే వాహనదారులు నిలిపిన వాహనాన్ని గుర్తించలేక ఢీకొనే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆగాల్సి వస్తే సురక్షితమైన ప్రదేశాల్లో, నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే వాహనాలను నిలపాలి. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం, అధిక శబ్దంతో సంగీతం వినడం వంటివి చేయకూడదు. బయట నుంచి వచ్చే వాహనాల శబ్దాలు, హారన్లను గమనించేలా అప్రమత్తంగా ఉండాలి.
వారికీ ప్రత్యేక జాగ్రత్తలు
తెల్లవారుజామున విధుల నిమిత్తం రహదారులపైకి వచ్చే పాల సరఫరా వాహనాలు, వ్యవసాయ కూలీలను తరలించే ట్రాక్టర్లు, ఆటోలు, ప్రైవేటు బస్సుల డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆయా వాహనాలకు ఫాగ్‌లైట్లు, అవసరమైన హెచ్చరిక లైట్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది. పొగమంచు తీవ్రతను బట్టి ప్రయాణ వేగాన్ని తగ్గించుకోవాలి. కొద్దిపాటి అప్రమత్తతతో విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మంచు దుప్పట్లో రహదారులు
పొంచి ఉన్న ప్రమాదం
అప్రమత్తతే రక్షణ
వేగ నియంత్రణతోనే ప్రమాదాలకు
అడ్డుకట్ట


