మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు

Nov 25 2026 12:14 AM | Updated on Nov 25 2026 12:14 AM

● అధికారుల హెచ్చరిక

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ రమేష్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ సుజాత హెచ్చరించారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు మంగళవారం నెల్లూరు సర్వజన ఆస్పత్రి ఆవరణలోని జిల్లా ఔషధ నియంత్రణ కార్యాలయంలో ఈగల్‌ టీమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రామడాల్‌ వంటి మత్తు కలిగించే మందులతోపాటు కోడీన్‌ కలిగిన దగ్గు సిరప్‌లకు కొందరు యువత బానిసలవుతున్నారని తెలిపారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు సైతం ట్రామడాల్‌ మాత్రలను పొడి చేసి నీటిలో కలిపి తాగుతూ మత్తుకు అలవాటు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి మందులను వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా విక్రయించకూడదని స్పష్టం చేశారు. మత్తు మందుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు పోలీసు, వైద్య, ఔషధ నియంత్రణ శాఖల సమన్వయంతో ఈగల్‌ టీమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు మందుల దుకాణాలపై డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. హెచ్‌1 కేటగిరీ మందుల విక్రయాలకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్‌ నిర్వహించాలని, కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో ఎపిడెమియాలజిస్ట్‌ డాక్టర్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement