● డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
నెల్లూరు(క్రైమ్): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో జిల్లా పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసిందని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలో డీజీపీ పర్యటించారు. చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించి పరిశీలించారు. పోలీసు సంక్షేమంలో భాగంగా పురుష, మహిళా పోలీసు బ్యారెక్స్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. నూతన జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కాన్ఫరెన్స్‌హాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ ఉల్లంఘనుల గుర్తింపు, రహదారి భద్రత చర్యల సమన్వయానికి ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు. పోలీస్ గ్రౌండ్‌లోని ఉమేష్‌చంద్రా కాన్ఫరెన్స్ హాలు పైఅంతస్తులో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను డీజీపీ ప్రారంభించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, అత్యవసర సేవలు, పోలీసు పర్యవేక్షణ వ్యవస్థలను ఒకే వేదికపైకి అనుసంధానించడం ఈ కేంద్రం ప్రత్యేకత అన్నారు. జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన ఈ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఇతర జిల్లాల్లోనూ విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


