● నెల్లూరులో జోన్ అసోసియేషన్ల
ప్రతినిధుల సమావేశం
నెల్లూరు(టౌన్): రాయలసీమలో హాకీ క్రీడ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయనున్నట్లుగా హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు స్పర్‌జాన్ రాజ్, ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, కోశాధికారి పి.థామస్ పీటర్ తెలిపారు. మంగళవారం నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో రాయలసీమ జోన్ హాకీ అసోసియేషన్ల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో హాకీ క్రీడను విస్తృతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని, ఆస్ట్రోటర్ఫ్ హాకీ మైదానాలు కేటాయించేలా హాకీ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని నిర్ణయించారు. పాఠశాలలు, కళాశాలల్లో హాకీని ప్రోత్సహించడంతోపాటు జిల్లా, ప్రాంతీయ స్థాయిలో పోటీలు నిర్వహించాలని తీర్మానించారు. అలాగే అన్ని జిల్లాల్లో హాకీ మైదానాలను గుర్తించి అభివృద్ధి చేయడం, క్రీడాకారులకు శిక్షణ, పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంపై చర్చించారు.
టోర్నమెంట్ నిర్వహణ
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మైదానాల్లో శిక్షణ పొందే అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా నేతలు అన్నారు. రాయలసీమ స్థాయిలో 5–ఎ–సైడ్ హాకీ టోర్నమెంట్ నిర్వహించి అన్ని జిల్లాల క్రీడాకారులకు ఒకే వేదికపై పోటీపడే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పొందేలా సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు. స్పోర్ట్స్ కోటా ద్వారా లభించే ఉద్యోగ అవకాశాలపై క్రీడాకారులకు అవగాహన కల్పిస్తామన్నారు. రాయలసీమలో హాకీ అభివృద్ధి చెందాలంటే అన్ని జిల్లాల అసోసియేషన్లు ఐక్యంగా, పరస్పర సహకారంతో పనిచేయాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.


