మహాపాతకం ఆలయాల విధ్వంసం | Temples were demolished officially during Chandrababus tenure as Chief Minister | Sakshi
Sakshi News home page

మహాపాతకం ఆలయాల విధ్వంసం

Nov 25 2026 4:31 AM | Updated on Nov 25 2026 4:31 AM

Temples were demolished officially during Chandrababus tenure as Chief Minister

పుష్కరాల సమయంలో విజయవాడలో చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన ఆలయం

చంద్రబాబు సీఎంగా ఉండగా అధికారికంగానే దేవాలయాల కూల్చివేతలు  

తాజాగా తిరుపతిలో అత్యంత పురాతన చారిత్రక ఆంజనేయస్వామి ఆలయంపై బాబు గునపం  

2015 కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40కిపైగా దేవాలయాలు నేలమట్టం 

భక్తుల విశ్వాసాలు, ఆగమాలను లెక్క చేయకుండా జేసీబీలతో ఇష్టానుసారం గుడుల కూల్చివేత 

అటు ఆలయాలు నేలమట్టం.. ఇటు భక్తులకు భద్రత కరువు 

బాబు పాలనలో దేవాలయాల్లో వరుస విషాదాలు.. లెక్క లేనన్ని అపచారాలు 

తిరుమల చరిత్రలోనే తొలిసారిగా తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి 

సింహాచలం చందనోత్సవంలోనూ భక్తుల మృత్యువాతతో విషాదం 

తొలిసారి శ్రీశైలం ఆలయంలో భక్తులపైనా లాఠీ ఎత్తిన ఘనత బాబు ప్రభుత్వానిదే  

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతున్నప్పుడల్లా అధికారికంగానే దేవాలయాల కూల్చివేతలు, అపచారాలు ఆనవాయితీగా మారాయని హైందవ ధార్మిక సంస్థలు, భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత రెండున్నరేళ్లుగా ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత లోపించగా తాజాగా తిరుపతిలో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందనే నెపంతో అతి పురాతన, అత్యంత విశిష్టత కలిగిన వేల ఏళ్ల నాటి చారిత్రక ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహాన్ని రాత్రికి రాత్రే గునపాలతో పెకిలించడం.. ఆలయాన్ని పొక్లెయిన్లతో కూల్చివేసిన తీరుపై భక్తులు, హిందూ సమాజం మండిపడుతోంది. 

సనాతన ధర్మం పేరిట రాజకీయ విద్వేషాలను రగిల్చేలా రెచ్చగొడుతున్న ప్రభుత్వ పెద్దలు నిత్యపూజలు జరిగే ఆలయం తొలగింపులో కనీసం ఆచార సంప్రదాయాలను పాటించలేదని కన్నెర్ర చేస్తున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉండగా కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో ఏకంగా 40కిపైగా పవిత్ర దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన ఘటనను గుర్తు చేస్తున్నారు.   

                       శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఝుళిపించిన పోలీసులు(ఫైల్‌)  

బాబు పాలనలో నిత్య అపచారాలు.. 
మనసు నిండా భక్తి భావంతో పుణ్యక్షేత్రాలకు తరలి వచ్చే భక్తులపైనా ఖాకీలు లాఠీలు ఎత్తిన ఘటన తొలిసారిగా చంద్రబాబు పాలనలోనే శ్రీశైలం ఆలయంలో చూడాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. 2025 జనవరి 8న తిరుమల ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల క్యూలైన్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృతి చెందడం అందరినీ కలచివేసింది. 

                  తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట(ఫైల్‌)  

అనంతరం నాలుగు నెలల్లోనే సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ చందనోత్సవం సందర్బంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృత్యువాత పడ్డారు.ఆ తరువాత ఆరు నెలలకు 2025 నవంబరులో కార్తీక ఏకాదశి వేళ కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరగడంతో తొమ్మిది మంది సామాన్య భక్తులు బలయ్యారు. 

             2015–16లో చంద్రబాబు పాలనలో విజయవాడలో కూల్చిన గుడి (ఫైల్‌)   

ఇవన్నీ సర్కారు వైఫల్యాలేనని భక్తులు స్పష్టం చేస్తున్నారు. సంక్షోభాలను నివారించడంలో చాలా అనుభవజు్ఞడినని తనకు తానే చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆలయాల్లో వరుస దుర్ఘటనలు, భక్తుల మరణాల ఉదంతాలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వ పరంగా పటిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు కొద్ది రోజులు హడావుడి చేసి ఆ తరువాత గాలికి వదిలేయడం ఆనవాయితీగా మారిందని పేర్కొంటున్నారు. 

సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు మరణించడంతో పోలీసుల సహాయచర్యలు (ఫైల్‌)  

రాజకీయ లబ్దికి  తిరుమల లడ్డూపై దుష్ప్రచార కుట్రలు.. 
రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా తిరుమల శ్రీవారి లడ్డూపైనా దుష్ప్రచార కుట్రలకు చంద్రబాబు బరి తెగించారు. జరగని కల్తీ... వాడని నెయ్యి గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు యత్నించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ నిస్సిగ్గుగా స్వయంగా చంద్రబాబే ఆరోపణలు చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విభ్రాంతి వ్యక్తమైంది. 

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు వాడారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు.. తాను మాట్లాడిన అబద్దాలు నిజమని నమ్మించేందుకు తనకున్న అధికారం మొత్తం దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ లాంటి అత్యున్నత సంస్థ ఆధ్వర్యంలోని సిట్‌ ఈ అంశంపై విచారణ జరిపి చార్జిషీట్‌ దాఖలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా అదే దు్రష్పచారాన్ని కొనసాగించాలనుకోవడాన్ని భక్తులు, హిందూ సంఘాలు, మేధావులు తీవ్రంగా తప్పుబట్టాయి.  

               తిరుపతి సమీపంలోని పురాతన ఆలయాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం  

దేవుడి ఆస్తుల కైంకర్యం..! 
దేవదాయశాఖ భూములను 33 ఏళ్ల పాటు దీర్ఘకాలికంగా వివిధ సంస్థలకు లీజుకిచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం జీవో 139 తేవడాన్ని కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతున్న బీజేపీతో పాటు విశ్వహిందూ పరిషత్‌ లాంటి హిందూ ధార్మిక సంస్థలు తప్పుబట్టాయి. దేవుడి భూములను గరిష్టంగా 11 ఏళ్లకు టెండరు ద్వారా మాత్రమే లీజుకివ్వాలని దేవదాయ శాఖ విధివిధానాలు స్పష్టంగా నిర్దేశిస్తుంటే.. 33 ఏళ్ల పాటు కట్టబెట్టడం ఎవరి ప్రయోజనాల కోసమని మండిపడ్డాయి. 

» విజయవాడ గొల్లపూడి వద్ద ఉన్న కృష్ణా జిల్లా గొడుగుపేట దేవాలయానికి చెందిన భూమిని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, గోల్ఫ్‌ కోర్టు కోసం కేటాయించాలని చంద్రబాబు సర్కార్‌ ఆదేశాలు జారీ చేయడం... దేవాలయాల భూములన్నీ ప్రభుత్వ భూములే అనే ధోరణితో గూగుల్‌ డేటా సెంటర్‌కి కేటాయించే చర్యలను వీహెచ్‌పీ తప్పుబట్టిన విషయం తెలిసిందే.  

»  మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4,111 ఆలయాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయగా.. 2024 జూన్‌లో చంద్రబాబు సర్కార్‌ వచ్చాక దాదాపు 1,724 ఆలయాల నిర్మాణ అనుమతులను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా మంజూరు చేసిన వాటిని అధికార పార్టీ నేతలకు లబ్ది చేకూర్చేందుకు టెండర్‌తో సంబంధం లేకుండా పంచి పెట్టాలని నిర్ణయించడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement