అమాయక గిరిజనులపై ఒడిశా పోలీసుల దౌర్జన్యాలు
ఎన్నికల్లో పోటీచేయకుండా అభ్యర్థులపై ఒత్తిళ్లు
నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులు
అక్రమ అరెస్టులు, నిర్బంధాలు
90 ఏళ్లుగా తీరని ఏపీ–ఒడిశా సరిహద్దు వివాదం
ఒడిశా చర్యలపై కనీసం స్పందించని చంద్రబాబు కూటమి ప్రభుత్వం
కొటియా గ్రామాలను ఒడిశాకు వదిలేసి చోద్యం చూస్తున్న సర్కారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు వివాదం మరోసారి గిరిజనుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టింది. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని కొటియా గ్రామాల సమస్య ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరింత ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఒడిశా పోలీసులు చర్యలకు దిగుతుండటం కలకలం రేపుతోంది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అభ్యర్థులను బెదిరిస్తున్నారని, అరెస్టు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు సరిహద్దు గ్రామాల్లో గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం స్పందించలేదు.
ఎన్నికల్లో పోటీచేస్తే అరెస్టేనా?
స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొటియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతానికి చెందిన లిబిరి, ఎస్.బీసు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరిని ఒడిశా పోలీసులు అరెస్టు చేసి కోరాపుట్ జైలుకు తరలించారు. వారు కొద్దిరోజులుగా జైల్లోనే మగ్గుతున్నారు. రాజు, బిత్రు, డోచు, పితృ అనే మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కొటియా ప్రాంతంలోని గంజాయిభద్ర, పట్టు చెన్నూరు, పగులు చెన్నూరు గ్రామాలకు చెందిన పదిమందిని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నా మన పాలకులు చోద్యం చూస్తూ కూర్చోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
90 ఏళ్లుగా తేలని సరిహద్దు పంచాయితీ
ఆంధ్ర–ఒడిశా మధ్య కొటియా గ్రామాలపై వివాదం దాదాపు 90 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ గ్రామాలపై తమకే హక్కు ఉందంటూ రెండు రాష్ట్రాలు వాదిస్తుండటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఈ వివాదంలో సరిహద్దు గ్రామాల ప్రజలు నలిగిపోతున్నారు. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల సమయంలోను కొటియా గ్రామాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. గ్రామాలపై ఆధిపత్యం కోసం రెండు రాష్ట్రాల పరిపాలన యంత్రాంగాలు పోటీపడుతుండటంతో స్థానిక పాలన, ప్రభుత్వ పథకాల అమలు, ఎన్నికల నిర్వహణలో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయంలో అరెస్టులు, బెదిరింపుల ఆరోపణలు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
వేలాదిమంది గిరిజనులపై ప్రభావం
సరిహద్దు వివాదం కారణంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని 21 గ్రామాలు, నాలుగు పంచాయతీల పరిధిలో సుమారు 4,835 మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆదివాసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని రెండు పంచాయతీల పరిధిలో మరో 1,200 మంది గిరిజనులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కారం కాకపోవడంతో తమ ప్రాంతంలో ఎవరి పాలన కొనసాగుతోందో, తమ హక్కులకు ఎవరు భరోసా ఇస్తారో తెలియని దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్
సరిహద్దు గ్రామాల్లో గిరిజనులపై ఒడిశా పోలీసుల వేధింపులను అరికట్టి, వారికి రక్షణ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మికసంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కోరాపుట్ జైలులో ఉన్న ఇద్దరు అభ్యర్థుల విడుదలకు చర్యలు తీసుకోవాలని, పోలీసుల అదుపులో ఉన్న నలుగురికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సరిహద్దు గ్రామాల్లోకి పోలీసులు ప్రవేశించి గిరిజనులను భయభ్రాంతులకు గురిచేయడం, ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని పేర్కొంటున్నారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలకు భద్రత కల్పించాలని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కొటియాను వదిలేశారా?
సరిహద్దు గ్రామాల్లో ఒడిశా పోలీసులు చర్యలకు దిగుతున్నా ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే హక్కును కాపాడటం, సరిహద్దు గ్రామాల ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా.. కొటియా గ్రామాలపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది.. అని నిలదీస్తున్నాయి. రాష్ట్రాల మధ్య వివాదం ఉన్నంత మాత్రాన అక్కడి ప్రజల రాజ్యాంగ హక్కులకు భంగం కలగకూడదని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు.


