ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో జరిగిన రూ.7 కోట్ల కుంభకోణం కేసులో తన కుమార్తెని బలిపశువుని చేశారని ధరణి కృష్ణ అనే మహిళ తల్లి నాగమణి వాపోయారు. తొలుత హెబియస్ కార్పస్ పిటిషన్, ఆపై తన కూతురి ఆచూకీ తెలియడం లేదని, అక్రమ నిర్బంధం నుంచి విడిపించాలని కోరుతూ ఈమె ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఇదలా ఉండగానే నాగమణి సంచలన వీడియో విడుదల చేశారు.
సీఐడీ పోలీసులు తనని వేధిస్తున్నారని నాగమణి సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్‌ని కన్నీటితో వేడుకుంటూ వీడియో విడుదల చేశారు. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ సీఐడీ పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఏడు కోట్ల మోసం కేసుతో నా కుమార్తెకు ఎలాంటి సంబంధం లేదు. ధరణికృష్ణ, కోట రుక్మిణి దగ్గర పనిచేసింది. తనకు తానుగానే స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది.
నా కూతురుని మూడు రోజుల పాటు పోలీసులు చిత్రహింసలు పెట్టారు. ఆడపిల్ల అని చూడకుండా చెప్పుకోలేని చోట బూటు కాళ్లతో తన్నారు. హెబియస్ కార్పస్ వేయడంతో వదిలేశారు. హెబియస్ కార్పస్ వేయకముందు మీతో చెప్పుకుందామని జనసేన ఆఫీస్‌కి వచ్చాను. ఒక మహిళా లాయర్.. నేను చెప్పింది వినకుండా వెళ్లపొమ్మన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళితే కేసు తీసుకోలేదు. అక్కడికి వెళ్లిన తర్వాత నుంచి నా కుమార్తె కనిపించడం లేదు. నా కూతురు బ్రతికుందో లేదో తెలియడం లేదు. నన్ను, నా చిన్న కూతురు, చిన్న అల్లుడిని సీఐడీ పోలీసులు వేధిస్తున్నారు. మా ఇంటికి వచ్చిన సీఐడీ పోలీసులు సీసీ కెమెరాలు ఆపేసి మమ్మల్ని వేధించారు. ఇద్దరు చిన్నపిల్లలతో నేను బ్రతకాలో చావాలో మీరే చెప్పండి. సామాన్యులమైన మాకు బ్రతికే హక్కు కూడా లేదా అని నాగమణి.. పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించారు.


