సాక్షి,పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలోనే ఆయన అనుచరుడు (పీఏ) చక్రీపై సొంత పార్టీకి చెందిన జనసేన నాయకులు దాడికి దిగారు.
పిఠాపురం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ పదవి అభ్యర్థి ఎంపిక విషయంలో జనసేన కౌన్సిలర్లు, నేతల మధ్య రెండు వర్గాలుగా విభేదాలు తలెత్తాయి. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ కౌన్సిలర్ పిండి సంధ్యకు కాకుండా, ఇటీవల పార్టీలో చేరిన బొజ్జ వెంకటేశ్వరరావుకు వైస్ ఛైర్మన్ పదవి కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించడంపై మెజారిటీ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ అనవసరమైన పోటీ రావడానికి, కౌన్సిలర్ల మధ్య చిచ్చు రేపి పార్టీలో విభేదాలు సృష్టించడానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడు చక్రీయే ప్రధాన కారణమని అసమ్మతి వర్గం నాయకులు భావించారు. ఎన్నిక ప్రక్రియ కోసం మున్సిపల్ కార్యాలయం వద్దకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఆయన అనుచరుడు చక్రీ చేరుకోగానే పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. కార్యాలయం బయటే ఉన్న అసంతృప్త జనసేన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా చక్రీపై ఆగ్రహంతో దాడికి దిగారు. సాక్షాత్తూ ఎంపీ సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.


