బట్టబయలైన 2024 ఎన్నికల అక్రమాలు!.. వైఎస్సార్‌సీపీ సంచలన ట్వీట్ | 31,000 Voter Slip Gap in Chittoor After 6 PM in 2024 Polls: Reporters Collective Report | Sakshi
Sakshi News home page

బట్టబయలైన 2024 ఎన్నికల అక్రమాలు!.. వైఎస్సార్‌సీపీ సంచలన ట్వీట్

Nov 23 2026 5:26 PM | Updated on Nov 23 2026 6:02 PM

31,000 Voter Slip Gap in Chittoor After 6 PM in 2024 Polls: Reporters Collective Report

సాక్షి,తాడేపల్లి : 2024 అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్‌సీపీ సంచలన ట్వీట్‌ చేసింది. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల అక్రమాలపై ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. ప్రముఖ ఇన్వెస్టిగేటీవ్‌ మీడియా సంస్థ ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ 2024 పోలింగ్‌ అక్రమాలను సోమవారం (నవంబర్‌ 11న)  బయటపెట్టింది. ఆ వివరాలను ఉటంకిస్తూ వైఎస్సార్‌సీపీ పోస్టు చేసింది. 31,471ఓట్లు ఎక్కడికి పోయాయో? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా నాటి ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన.. వైఎస్‌ జగన్‌ వీడియోను కూడా వైఎస్సార్‌సీపీ పోస్టు చేసింది. 

 

రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ జర్నలిస్టుల పరిశోధనల్లో ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం, దాని పరిధిలోని కుప్పం (చంద్రబాబు గెలిచిన నియోజకవర్గం) సహా 7 అసెంబ్లీ స్థానాలలో సాయంత్రం 6 గంటల తర్వాత పోలైన ఓట్ల సంఖ్యలో భారీ తేడా ఉందని  ది రిపోర్టర్స్ కలెక్టివ్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల సంఘం అంతర్గత రికార్డులైన ‘రిపోర్ట్స్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్’ పత్రాలను విశ్లేషిస్తూ నాటి ఎన్నికల్లో జరిగిన అక్రమాలను బట్టబయలు చేసింది

2024 మే 13న ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి, పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్‌లో వేచి ఉన్న ఓటర్లకు ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఓటర్ స్లిప్పులు (టోకెన్లు) జారీ చేస్తారు. ఆ స్లిప్పులు ఉన్నవారు మాత్రమే 6 గంటల తర్వాత ఓటు వేయడానికి అర్హులు.

ఒకే పోలింగ్ బూత్‌లో, ఒకే క్యూ లైన్‌లో నిలబడిన ఓటరు లోక్‌సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఓటు వేస్తారు కాబట్టి, రెండు ఎన్నికలకు సంబంధించి 6 గంటల తర్వాత క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య సమానంగా ఉండాలి. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్న ఓటర్లకు 56,067 స్లిప్పులు జారీ చేసినట్లు ఈసీ రికార్డులు చెబుతున్నాయి.

కానీ, అదే చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల (కుప్పం, చంద్రగిరి, చిత్తూరు, నగరి, పలమనేరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు) రికార్డులను కలిపి చూస్తే, సాయంత్రం 6 గంటల తర్వాత కేవలం 24,596 మంది మాత్రమే క్యూలో ఉన్నట్లు నమోదైంది. అంటే, ఒకే క్యూ లైన్‌లో నిలబడిన ఓటర్ల లెక్కలో ఏకంగా 31,471 మంది తేడా (అసాధారణ వ్యత్యాసం) కనిపించింది.

👉క్లిక్‌ చేయండి : 2024 ఏపీ ఎన్నికల అక్రమాలపై ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ఇచ్చిన నివేదిక ఇదే 

చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కుప్పం ఒకటి. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఏడు అసెంబ్లీ స్థానాలు చిత్తూరు ఎంపీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. ఇంతటి కీలకమైన నియోజకవర్గాల పరిధిలో రికార్డులలో ఇంత భారీ తేడా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఒక రోజు వ్యవధిలో రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘానికి పంపిన రెండు వేర్వేరు నివేదికలలో ఇంత పెద్ద ఎత్తున గణాంకాల వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం దీనిపై ఎలాంటి విచారణ జరపలేదని రిపోర్టర్స్ కలెక్టివ్ పేర్కొంది. నిబంధనల ప్రకారం, పోలింగ్ సరళిలో లేదా స్లిప్పుల లెక్కల్లో అనుమానాస్పద తేడాలు కనిపిస్తే రిటర్నింగ్ అధికారి వెంటనే అప్రమత్తమై, ఆ పోలింగ్ కేంద్రంలో రీ-పోలింగ్ నిర్వహించాలని ఈసీకి సిఫార్సు చేయాలి. కానీ ఇక్కడ ఆ నివేదికలను పట్టించుకోకుండా పక్కన పెట్టేశారని కథనం ఆరోపించింది.  

ఈ వ్యత్యాసంపై వివరణ కోరుతూ రిపోర్టర్స్ కలెక్టివ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిని  సంప్రదించగా, ఈసీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. జిల్లా ఎన్నికల అధికారిని సంప్రదించాలని ఏపీ సీఈఓ కార్యాలయం సూచించింది.

ఈ నివేదిక వెలువడిన వెంటనే ఏపీలో రాజకీయ చర్చ మొదలైంది. 2024 ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల తర్వాత, అర్ధరాత్రి వరకు అసాధారణ రీతిలో పోలింగ్ శాతం పెరగడంపై తాము మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని, రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదికతో తమ ఆరోపణలకు బలం చేకూరిందని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఎన్నికల సంఘం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  

చివరిగా ఎన్నికల పారదర్శకతను కాపాడాల్సిన ఎన్నికల సంఘం తన సొంత రికార్డులలో ఉన్న ఇంత పెద్ద తప్పును గుర్తించి విచారణ జరపడంలో విఫలమైందని, దీనివల్ల సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్ పవిత్రతపై సందేహాలు తలెత్తుతున్నాయని రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ స్పష్టం చేసింది

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement