సాక్షి,చంద్రగిరి: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల నామినేషన్ల తిరస్కరణపై ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే నాని చంద్రగిరిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 90 శాతానికి పైగా సర్పంచ్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నామినేషన్ల తిరస్కరణ జరిగింది. ఎమ్మెల్యే నాని గ్రామాల్లో తిరిగితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏమిటో తెలుస్తుంది’ అని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల పేరుతో ఒక్కో పంచాయతీకి రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎమ్మెల్యే నాని వసూలు చేశారని ఆయన ఆరోపించారు.
నామినేషన్ల తిరస్కరణపై న్యాయపోరాటం చేస్తామని మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమంగా నామినేషన్లు తిరస్కరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘10 నుంచి 12 సెట్ల నామినేషన్లు వేసినా అన్నింటినీ తిరస్కరించారు. బాధ్యులైన అధికారులకు న్యాయస్థానంలో శిక్ష పడేవరకు పోరాడుతాం’ అని పేర్కొన్నారు. నామినేషన్ల అప్పీల్‌లో భాగంగా ఆర్డీఓకు 700కు పైగా దరఖాస్తులు అందించామని ఆయన పునరుద్ఘాటించారు.


