అదే రోజు పోలింగ్ అనంతరం పంచాయతీ ఎన్నికల ఫలితాలు
30న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడి...
డిసెంబర్ 5న 23 పట్టణ స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు
ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠ
సాక్షి, అమరావతి: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు తావుండకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆయా జిల్లాల అధికారులకు స్పష్టంచేశారు. మలివిడత మున్సిపల్ ఎన్నికలతో పాటు తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 26న జరుగుతున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించేందుకు అదనపు పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో అదనంగా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కౌంటింగ్ కోసం అదనపు ఏర్పాట్లు..
మున్సిపల్ ఎన్నికల్లో మేయర్, చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలై రాత్రి 8 గంటల లోపు పూర్తిచేసి, తుది ఫలితాలు ప్రకటించేలా గతంలో కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటివిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సుమారు 19 శాతం వరకు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, సుమారు 36 శాతం మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వివరించారు.
30న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు...
ఈ నెల 26వ తేదీన 23 పట్టణ స్థానిక సంస్థలు, 26 జిల్లాల్లో (విశాఖపట్నం, గుంటూరు మినహా) గ్రామ పంచాయతీలకు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. అదే రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయన్నారు. నవంబర్ 30వ తేదీన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. నవంబర్ 29వ తేదీన రెండవ దశ, డిసెంబర్ 2వ తేదీన గ్రామ పంచాయతీల మూడో దశ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, డిసెంబర్ 5వ తేదీన 23 పట్టణ స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు నిర్వహించడంతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వివరించారు.
46వేల మందితో పోలీస్ బందోబస్తు
రాష్ట్రవ్యాప్తంగా 46,080 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామన్నారు.


