అన్నీ సక్రమంగా ఉన్నానామినేషన్లు తిరస్కరిస్తున్నారు | Nominations are being rejected even when everything is in order | Sakshi
Sakshi News home page

అన్నీ సక్రమంగా ఉన్నానామినేషన్లు తిరస్కరిస్తున్నారు

Nov 25 2026 4:42 AM | Updated on Nov 25 2026 4:42 AM

Nominations are being rejected even when everything is in order

సక్రమంగానే ఉన్నాయని అధికారులు మొదట ధ్రువీకరిస్తున్నారు 

ఆ తరువాత ఆర్వో సక్రమంగా లేవంటున్నారు 

అప్పీల్‌ చేస్తే ఆర్డీవోలు భిన్నమైన కారణాలు చెబుతున్నారు 

హైకోర్టులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పిటిషన్‌ 

స్పందించిన హైకోర్టు.. ఎన్నికల కమిషన్, ఆర్వో, ఆర్డీవోలకు నోటీసులు

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను సక్రమంగా దాఖలు చేస్తున్నప్పటికీ, రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వో­లు) ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలను తీసివేసి, నామినేషన్లను తిరస్కరిస్తుండటంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అధికార పార్టీ అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు రిటర్నింగ్‌ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల్లో కొన్నింటిని తొలగిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం.నిడమలూరు గ్రామానికి చెందిన వాకా బాలకృష్ణారెడ్డి, మరో ఇద్దరు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నికల కమిషనర్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న ఆర్డీవో చంద్రశేఖర్‌ నాయుడు, రిటర్నింగ్‌ అధికారి చలపతి తదితరులకు సైతం నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి 
అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల నామినేషన్లు అన్నీ సక్రమంగా ఉన్న­ట్లు ధ్రువీకరించిన అధికారులు.. ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తిరస్కరించారని చెప్పారు. ‘పిటిషనర్లు ఈ నెల 17న సర్పంచ్‌ పదవికి ఆర్వోకు నామినేషన్లు సమర్పించారు. అదే రోజు వాటిని పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయని ఆర్వో రాతపూర్వకంగా ధ్రువీకరించారు. అధికార పార్టీ అభ్యర్థి అంజిబాబు ఫిర్యాదు చేశారంటూ, పిటిషనర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అదే రిటర్నింగ్‌ అధికారి మరుసటి రోజున పిటిషనర్ల నామినేషన్లను తిరస్కరించారు. 

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ లేదని, పోలీసు కేసులను పేర్కొనలేదని కారణాలుగా చెప్పారు. పిటిషనర్‌ ఆర్డీవో ముందు అప్పీల్‌ చేయగా.. ఆర్వో లేవనెత్తిన కారణాలకు భిన్నమైన కారణాలను ఆర్డీవో లేవనెత్తారు. కొన్ని పేజీలు లేవని, సాక్షుల సంతకాలు లేవని ఆర్డీవో చెప్పారు. ఆర్వో చెప్పిన కారణాలు సరైనవేనా? కావా? అన్నది మాత్రమే ఆర్డీవో చూడాలి. కారణాలు లేవనెత్తడం సరికాదు. ఆర్డీవోది అధికార దుర్వినియోగమే. 

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఆ అధికారులపై క్రిమినల్, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఎం.నిడమలూరు సర్పంచ్‌ పోస్టుకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేస్తే, పిటిషనర్లతో సహా ఆరుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థి అంజిబాబే మిగిలారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారుల అధికార దుర్వినియోగానికి, రాజకీయ పక్షపాతానికి ఇది పరాకాష్ట’ అని నాగిరెడ్డి వివ­రించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement