రిషిత్ జోయల్‌ను అంబులెన్స్‌లో తీసుకువెళ్తున్న సిబ్బంది
ఎ.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల సిబ్బంది మందలించడంతో మనస్తాపానికి గురైన 9వ తరగతి విద్యార్థి దుగ్గిపోవు రిషిత్ జోయల్ సోమవారం ఉదయం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చర్మవ్యాధి సమస్యతో బాధపడుతున్న విద్యార్థిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించారు. వైద్యులు మందులు ఇచ్చి తిరిగి పాఠశాలకు పంపించారు.
గతంలోనూ రిషిత్ జోయల్ చర్మవ్యాధి బారిన పడటంతో అతని తండ్రి జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి నుంచి వచ్చిన తరువాత గతంలోనూ తల్లిదండ్రులకు చర్మవ్యాధి గురించి చెప్పారు. ఇలా ఎందుకు చెబుతున్నావంటూ పాఠశాల సిబ్బంది రిషిత్‌జోయల్‌ను మందలించారు. దీంతో మనస్తాపానికి గురై విద్యార్థి తనకు ఇచ్చిన మాత్రలన్నీ మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన సిబ్బంది మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడికి ప్రాణాపాయం తప్పింది.
14 మందికి చర్మవ్యాధులు
పాఠశాలలో కనీస వసతులు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి గదులు, మరుగుదొడ్ల అపరిశుభ్రత, స్నానపు గదులు నీటి నాణ్యత లోపంతో 14 మందికి పైగా విద్యార్థులు చర్మవ్యాధుల బారిన పడ్డారు. ఈ సమాచారం అందుకున్న తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్ మంగళవారం గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మిటరీలు, వంటగది, మరుగుదొడ్లలో దుర్గంధం, అపరిశుభ్రతపై ప్రిన్సిపాల్, సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. సమస్యలను కప్పిపుచ్చకుండా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.


