భూ రికార్డుల పోర్టల్‌ బంద్‌ | Webland stalled for 14 days | Sakshi
Sakshi News home page

భూ రికార్డుల పోర్టల్‌ బంద్‌

Nov 25 2026 5:39 AM | Updated on Nov 25 2026 5:39 AM

Webland stalled for 14 days

14 రోజులుగా స్తంభించిన వెబ్‌ల్యాండ్‌   

మ్యుటేషన్లు, సబ్‌ డివిజన్లు, కరెక్షన్లు అన్నింటికీ బ్రేక్‌ 

భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి పేర్లు రికార్డుల్లోకే ఎక్కడంలేదు 

హ్యాకింగ్‌పై ‘సాక్షి’ కథనాన్ని తొలుత ఖండించిన సర్కారు

కానీ, సీఐడీ కేసుతో బండారం బట్టబయలు 

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై నెపం.. సీసీఎల్‌ఏ పెద్దలకు ప్రభుత్వం అండ 

సీఎంఆర్‌ఓ సెక్షన్‌కు చంద్రబాబు సర్కారు రక్షణ కవచం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వెబ్‌ల్యాండ్‌ అక్రమాల దెబ్బకు కొద్దిరోజులుగా భూ రికార్డుల పోర్టల్‌ పూర్తిగా ఆగిపోయింది. 14 రోజులుగా మ్యుటేషన్లు, సబ్‌ డివిజన్లు, రికార్డుల సవరణæలు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోవడంతో ఆ వ్యవస్థ పడకేసింది. భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్   చేయించుకున్న వారి పేర్లు రికార్డుల్లోకి ఎక్కడంలేదు. వారసత్వ బదిలీలు నిలిచిపోయాయి. అడంగల్, 1బీ సవరణలు జరగకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్తే సర్వర్‌ పనిచేయడం లేదని, వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌ అయిందని రకరకాల మాటలు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ అదే సమాధానం వస్తోంది. పోర్టల్‌ ఎప్పుడు పనిచేస్తుందో ఎవరికీ తెలియడం లేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి.  

హ్యాక్‌ అంటే ఖండించారు.. అదే నిజమైంది 
వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌ అవుతోందని, రికార్డులు ఇష్టారాజ్యంగా మారిపోతున్నాయని ‘సాక్షి’ గతంలోనే బయటపెట్టింది. అప్పుడు సర్కారు ఆ కథనాన్ని ఖండించింది. పోర్టల్‌ పూర్తి భద్రంగా ఉందని బుకాయించింది. అయితే, ఇప్పుడు సీఐడీ దర్యాప్తు ఆ గుట్టును రట్టుచేసింది. సీనియర్‌ ఎన్‌ఐసీ అధికారి లాగిన్‌ను దుర్వినియోగం చేసి సుమారు 30 భూ రికార్డులను మార్చారు. ప్రకాశం జిల్లా ఇండ్లచెరువు, పడమర లక్ష్మీపురంలో 6.55 ఎకరాలకు సంబంధించిన రికార్డుల్లో అనుమానాస్పద మార్పులపై సీసీఎల్‌ఏ నివేదికతో కేసు వెలుగుచూసింది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నట్లు తేలింది. మధ్యవర్తులు లబ్దిదారులను గుర్తించి ఎల్‌పీఎం (ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌), సర్వే నంబర్లు, ఆధార్, అడంగల్‌ కాపీలు సేకరించి అధికారి లాగిన్‌తో రికార్డులు మార్చేశారు. ఈ కేసులో సీఐడీ ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టుచేసింది.  

అక్రమాలు దాచలేక పోర్టల్‌ మూసివేత
ఈ నేపథ్యంలో.. తప్పులు, అక్రమాలను దాచలేని పరిస్థితుల్లో చంద్రబాబు సర్కారు ఏం చేయాలో తెలీక ప్రత్యామ్నాయం చూపకుండానే వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌ని మూసేసింది. వెబ్‌ల్యాండ్‌ మొత్తం మార్చే హడావుడిలో పడింది. కొత్త వ్యవస్థ ఎప్పటికి సిద్ధమవుతుందో, అప్పటిదాకా పెండింగ్‌ దరఖాస్తుల పరిస్థితి ఏమిటో స్పష్టత ఇవ్వడం లేదు. భూ యజమానులే తమ రికార్డులను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని సీఐడీ సలహా ఇవ్వడం గమనార్హం. వ్యవస్థను కాపాడాల్సిన ప్రభుత్వం ఆ భారాన్ని సామాన్యులపైకి నెట్టి చేతులు దులుపుకుంది.  

చిరుద్యోగులు మాత్రమే అరెస్టు
ఇదిలా ఉంటే.. వెబ్‌ల్యాండ్‌ అక్రమాల దర్యాప్తు మాత్రం పక్కదారి పట్టింది. నేరం మొత్తాన్ని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కంప్యూటర్‌ ఆపరేటర్లపై నెట్టేసి సీసీఎల్‌ఏ పెద్ద తలకాయలను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. సీనియర్‌ అధికారి లాగిన్‌ కిందిస్థాయి సిబ్బంది చేతికి, అక్కడి నుంచి మధ్యవర్తులకు చేరిందంటే పైస్థాయి అండ
లేకుండా సాధ్యంకాదు. లాగిన్‌ వివరాలు ఎవరి ద్వారా బయటకెళ్లాయి, ఎప్పటినుంచి ఈ దందా సాగుతోందనే కోణంలో దర్యాప్తు జరగడం లేదు. 

సీఎంఆర్‌ఓ సెక్షన్‌కు రక్షణ
భూ రికార్డుల మార్పులు, మ్యుటేషన్ల ఫైళ్లన్నీ నడిచే సీసీఎల్‌ఏలోని సీఎంఆర్‌ఓ సెక్షన్‌ను పూర్తిగా కాపాడే యత్నాలు జరుగుతున్నాయి. ఆ సెక్షన్‌ అధికారులను కనీసం విచారణకూ పిలవలేదు. అక్రమాలు జరిగిన కాలంలో అక్కడ ఎవరు పనిచేశారు?, ఏ ఫైళ్లు కదిలాయి అనే వివరాల జోలికే అస్సలు వెళ్లడంలేదు. పైగా.. బయటపడింది ఒక్క జిల్లాలోని 30 రికార్డులే. రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని మారాయో తేల్చే సమగ్ర ఆడిట్‌ ఊసేలేదు. 

కూటమి పెద్దల గప్‌చుప్‌! 
పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలకు కరెన్సీ నోట్ల తరహా భద్రత, బ్లాక్‌చెయిన్, క్యూఆర్‌ కోడ్‌లు తెస్తున్నామని చంద్రబాబు ఊరూవాడా డబ్బా తెగ కొట్టుకున్నారు. కానీ, అందుకు విరుద్ధంగా భూ రికార్డులు తారుమారైపోయాయి. లక్షలాది మంది రైతుల భూ హక్కులతో ముడిపడిన వ్యవస్థ హ్యాక్‌ అయినా, పోర్టల్‌ మూతపడినా ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ మౌనమే అసలు సూత్రధారులకు రక్షణ కవచంగా మారింది. అక్రమార్కుల పాపానికి సామాన్య రైతులు శిక్ష అనుభవిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement